‘రూ. 90 వేలు ఏమయ్యాయని నిలదీయండి’ | Sakshi
Sakshi News home page

‘రూ. 90 వేలు ఏమయ్యాయని నిలదీయండి’

Published Tue, Feb 6 2018 5:56 PM

Question Chandra Babu on Unemployment YS Jagan Asks Youth - Sakshi

సంగం, ఆత్మకూరు నియోజకవర్గం(పొట్టి శ్రీరాములు నెల్లూరు) : నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిలదీయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి యువతను కోరారు. చంద్రబాబు ఎక్కడా కనిపించినా మాకివ్వాల్సిన రూ. 90 వేలు ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించాలని చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఏం చేయబోతున్నామన్నది వివరించారు. ఆయన ఏమన్నారంటే.. ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. అయినా కూడా వేలాది మంది నాతో అడుగులో అడుగు వేశారు. కష్టాలను చెబుతూనే.. అన్నా.. మీ వెంటే మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఇలా నడిరోడ్డుపై ఎండలో నిలబడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అయినా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఇది చంద్రబాబు పాలనా తీరు
రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న పరిపాలనను ఒక్కసారి చూడండి. ఈ పెద్ద పాలనను నాలుగేళ్లు చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు పాలనను గమనించమని కోరుతున్నాను. ఇదే పెద్ద మనిషి ఎన్నికల సమయంలో అన్న మాటలు ఏంటి? మాట మీద నిలబడ్డారా? రేపు పొద్దున ఎన్నికలు జరిగితే అబద్ధాలు చెప్పేవాడు మళ్లీ నాయకుడు కావాలా? అనిఅడుగుతున్నాను. మోసం చేసేవాడు మీకు నాయకుడిగా రావాలా? అని అడుగుతున్నాను.

ఓటుకు రూ. 3 వేలు ఇస్తారు..
అన్యాయమైన, మోసం చేసే పాలనను క్షమిస్తే.. రేపొద్దున ఇదే పెద్ద మనిషి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటే వారు నమ్మరని చంద్రబాబుకు తెలుసు. కాబట్టి చంద్రబాబు రేపొద్దున ఏం చెబుతారో తెలుసా? ఇంతకంటే పైస్థాయిలోకి వెళ్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. మీరు నమ్ముతారా? నమ్మరు కాబట్టి కేజీ బంగారానికి బోనస్‌ అంటూ ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటాడు.

అయినా నమ్మరు అన్న సంగతి తెలిసి.. ఓటుకు రూ.3 వేలు కూడా ఇస్తాడు. డబ్బు ఇస్తే వద్దు అని చెప్పవద్దు.. కారణం ఏంటో తెలుసా? ఆ డబ్బు మనది.. మనల్ని దోచేసి ఆయన సంపాదించారు. డబ్బు తీసుకొని ఆయనకు తగిన బుద్ధి చెప్పండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. చెప్పిన మాట నెరవేర్చకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్ల కాదు.. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు తీసుకు రాగలను.

సలహాలు ఇవ్వండి..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. అందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు, సూచనలు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ నవరత్నాల్లో నుంచి రైతుల కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.

పంట వేసేందుకు పెట్టుబడి ఏర్పాటు చేసుకోవడంలో రైతులు ఇబ్బంది పడతారు. రైతుల సమస్యలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని నవరత్నాల్లో రైతులకు చేయాల్సిన వాటిని నిర్ణయించాం. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తాం. పెట్టుబడికి ఇబ్బందులు పడకుండా వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తాం.

జూన్‌ మాసం నుంచి రైతులు వ్యవసాయానికి సన్నద్ధం అవుతారు. ఆ సమయంలో పెట్టుబడులకు రుణాల చేస్తారు. అలాంటి ప్రతి రైతుకు ఒక నెల ముందు(అంటే మే నెలలో) రూ.12,500/- అందజేస్తాం.
రైతులను పట్టిపీడిస్తున్న మరో సమస్య నీరు. ఎన్నిసార్లు బోర్‌ వేయించడానికి ప్రయత్నించినా విఫలం చెంది రైతులు కూనరిల్లిపోతున్నారు.

అలాంటి సమస్య నుంచి రైతును బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రైతు పొలంలో బోరు వేయిస్తుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది. ప్రాజెక్టుల ద్వారా నీటి సాకర్యం అందే పొలాలకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి సాగునీరు అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాను.

రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చేస్తాం. పంట చేతికి అందక ముందే ప్రతి ఏటా గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. ఇందుకోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం. అకాలవర్షాలు, కరువు వచ్చిన సమయంలో ఆదుకునేందుకు రూ. 4 వేల కోట్ల ఆపద నిధిని ఏర్పాటు చేస్తాం. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం, దేశం మొత్తం సంతోషంగా ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే రైతు కన్నీళ్లు తుడిచేందుకు ఈ నిర్ణయాలను తీసుకున్నాం.

Advertisement
Advertisement