రాజ్యాంగం కంటే మీ చట్టాలు గొప్పవా?  | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం కంటే మీ చట్టాలు గొప్పవా? 

Published Fri, Apr 19 2019 2:54 AM

R Krishnaiah Slams KCR At Unemployees Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంతృత్వంగా వ్యవహరిస్తూ నిరసన తెలిపే, ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. ‘మీరు రూపొందించిన చట్టాలు రాజ్యాంగం కంటే గొప్ప వా..’అని ప్రశ్నించారు. ఎస్‌.ఐ, కానిస్టేబుల్స్‌ సెలక్షన్‌ ప్రక్రియలో సెన్సార్‌షిప్‌ సిస్టంని తొలగించాలని, ఆర్‌.ఎఫ్‌.డి సిస్టం వల్ల ఇబ్బందులున్నాయని, పరుగుపందెంలో అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ గురువారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ సభను నిర్వహించింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగులేమైనా ఎమ్మె ల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి స్థానాలను ఆశిస్తున్నారా.. వారు చదివిన చదువుకు తగిన ఫలం లాంటి ఉద్యోగాన్ని అడుగుతుంటే, దానిలో కూడా సవాలక్ష ఆంక్షలను విధిస్తూ ఏడిపించడం సరైనది కాదన్నారు. దీని వల్ల ఎందరో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు.  

మిమ్మల్ని జీవితాంతం కష్టపెడతాం 
సభ జరుగుతుండగానే ప్రెస్‌క్లబ్‌ వద్ద పోలీసులు  మోహరించారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషినల్‌ డీసీపీ చైతన్యకుమార్‌ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 20 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు,  200 మంది కానిస్టేబుళ్లు మోహరించారు. సభ ముగిసిన తర్వాత ఆర్‌.కృష్ణయ్య, కోదండరాం, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం నేత అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని 45 నిమిషాలపాటు ప్రెస్‌క్లబ్‌లో నిర్బంధించి తరువాత పోలీసుస్టేషన్‌కు తరలించారు. సభకు వచ్చిన నిరుద్యోగులను బయటకు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.‘మమ్మల్ని బయటకు వదలండి. చచ్చిపోయేటట్టు ఉన్నాం’అని వేడుకున్నా పోలీసులు గేట్లు తెరవలేదు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మమ్మల్ని మీరు గంట, 3 గంటలు లేదా ఒక రోజు,  నెల రోజులపాటు కష్టపెడతారేమో... మేం తల్చుకుంటే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా జీవితాం తం కష్టపడేటట్లు చేయగలం’అని హెచ్చరించారు.  

భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు 
అరగంట తరువాత గేట్లు తెరవడంతో అభ్యర్థులు బయటకు వచ్చారు. పోలీసులు 15 నుంచి 20 మందిని రౌండప్‌ చేశారు. తమ తోటివారికి ఏమైం దోనని దగ్గరకు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. ఓ పక్క ఎండ, మరో పక్క పోలీసుల వ్యవహారశైలితో విసిగిన నిరుద్యోగులు పెద్దఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు ఐదారొందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు,  కొంతమందిని అరెస్ట్‌ చేసి సమీప పోలీసుస్టేషన్లకు తరలించారు.  

18 వేల మందిని ముందే ఎంపిక చేసేసుకున్నారా? 
అభ్యర్థుల ఎంపికను సరైన రీతిలో చేయాలని వేలాదిమంది నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ప్రభుత్వం స్పందించడంలేదంటే, ముందుగానే ఆ 18 వేల మందిని సెలక్ట్‌ చేసేసుకున్నారనే అనుమానం వస్తోందని అన్నారు. న్యాయం కావాలని అడిగితే అరెస్ట్‌ చేస్తారా.. ఇలా ఎంతమందిని అరెస్ట్‌ చేసి పరిపాలన సాగిద్దామనుకుంటున్నారో పాలకులు అంతర్మథనం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేసే ఉద్యమానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.  

Advertisement
Advertisement