కలెక్టర్‌ గారూ నేను బతికే ఉన్నా.. | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారూ నేను బతికే ఉన్నా..

Published Fri, Jun 8 2018 12:30 PM

Rachamallu SivaPrasad Reddy Criticized Collector YSR Kadapa - Sakshi

ప్రొద్దుటూరు టౌన్‌ : ‘కలెక్టర్‌ గారూ... నేను ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డిని, నేను మరణించలేదు.. బతికే ఉన్నా’’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తుంటే ఆహ్వానించరా అని ప్రశ్నించారు. ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు ఆరు శిలాఫలకాలు ఆవిష్కరించి, చెన్నమరాజుపల్లె, నాగాయపల్లెల్లో ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారన్నారు. ఈ నియోజకవర్గ ప్రథమపౌరున్ని, 2 లక్షలమంది ఓటర్ల సేవకునిగా ఉన్నా తనను విస్మరించారని తెలిపారు. ఆహ్వాన పత్రిక కానీ, ఫోన్‌ ద్వారా సమాచారం కానీ ఇవ్వలేదన్నారు. తనతో పోటీపడి ప్రజలు తిరస్కరించడంతో ఓడిపోయిన వరదరాజులరెడ్డికి ఏ సంబంధం లేకపోయినా అన్నీతానై వ్యవహరించేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు అవకాశం కల్పిస్తారా? అని ప్రశ్నించారు.

ఇది న్యాయమా, హక్కులేని వాన్ని, అధికారంలేని వాన్ని అందలం ఎక్కిస్తారా.. ఇదేనా మీరు చదువుకున్న చదువు మీకు నేర్పిన సంస్కారం అని నిలదీశారు. తనను అగౌరవపరచడం అంటే 2లక్షలమంది ఓటర్లను అవమానించినట్లేనన్నారు.  ప్రజా సమస్యలపైన ఏ జిల్లా అధికారిని అన్నా ఒక్కమాట అంటే నల్లబ్యాడ్జీలు పెట్టుకొని అధికారులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. మరి ఇంత గొప్పగా అవమానపరిస్తే నల్లరిబ్బను కాదు, నల దుప్పటి కప్పుకోవాలని తెలిపారు. నాలుగురోజుల కిందట జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రోటోకాల్‌ విషయంలో ఎవ్వరినీ అగౌ రవపరచ వద్దని చెప్పిన కలెక్టర్‌ మరి ఇప్పుడు సమాధానం చెప్పాలని కోరారు. వరద ఓడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాల్లో వేదికపైకి ఎక్కించి దించుతున్నారే ఇది న్యాయమా అని అన్నారు.  తనను పిలవనందుకు ఒకవైపు సంతోషిస్తున్నానన్నారు. సీఎం రెండు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి చేస్తామంటూ ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చరని, అబద్ధపు హామీలు ఇచ్చారని తెలిపారు.

తాను వారి తోపాటు మోసగాన్ని అయ్యేవాడనని అన్నారు. ఉన్నతాధికారులకు చీము, నెత్తురు, పౌరుషం ఉంటే ఆ రెం డు గ్రామాలకు ఇచ్చిన హామీలను, డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని చెప్పారు. అది కూడా చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ వివరణ ఇవ్వాలని లేదంటే ఈ సమస్య కలెక్టర్‌ చాంబర్‌కు బదిలీ అవుతుందని హెచ్చరించారు. వారి ఆహ్వానం కోసం, మర్యాదల కోసం పాకులాడే మనసు తనకు లేదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదనే తాను ప్రశ్నిస్తున్నానని ప్రజలకు విజ్ఞప్తి  చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, పోసా భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement