రచనారెడ్డి, ఆదిత్యారెడ్డిపై వేటు..! | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 7:36 PM

Rachana Reddy, Aditya Reddy Suspended From TJS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదని, మహాకూటమిలో రాజకీయ బ్రోకర్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ రచనారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డిలపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.

పార్టీ ఏకగ్రీవ తీర్మానం మేరకు టీజెఎస్ ప్రజాకూటమిలో భాగస్వామ్యం అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రచనా రెడ్డి, ఆదిత్యారెడ్డి ఎన్నికల్లో యెల్లారెడ్డి, తాండూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకున్నారని, వారి సీట్ల విషయంలో పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం వారికి బాగా తెలుసునని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఎవరూ ప్రత్యామ్యాయం లేదని చెప్పడం వెనక వారు ఏ పార్టీతో అవగహన కుదుర్చుకుంటున్నారో స్పష్టమవుతోందని టీజేఎస్‌ ఆరోపించింది. సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు  క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది.

పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు.  కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement