‘కౌరవులు.. పాండవుల మధ్య 2019 యుద్ధం’ | Sakshi
Sakshi News home page

‘కౌరవులు.. పాండవుల మధ్య 2019 యుద్ధం’

Published Sun, Mar 18 2018 6:42 PM

Rahul Fires On BJP At Congress Plenary Meeting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై నిప్పులు చెరిగారు. దేశంలోని అమ్మాయిల వస్త్రధారణ ఎలా ఉండాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారంటూ విమర్శించారు. మహిళల వస్త్రధారణపైనే కాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లు తమకు నచ్చవంటూ భారతీయ జనత పార్టీ వారిని అవమానిస్తోందని అన్నారు.

అంతేకాకుండా ఏనాడూ పాకిస్తాన్‌ వెళ్లని భారత ముస్లింలను ఈ దేశం వారు కాదంటూ వారి దేశ భక్తిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమిళ ప్రజలు అమితంగా అభిమానించే వారి భాషను మార్చుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వం చెబుతుందని అన్నారు.

రాహుల్‌ గాంధీ ప్రసంగంలో ముఖ్యమైన పది అంశాలు

  1. చాలా సంవత్సరాల క్రితం కౌరవులకు, పాండవులకు మధ్య మహా యుద్ధం జరిగింది. అందులో కౌరవుల్లా ఇక్కడి బీజేపీ అధికారం కోసం మాత్రమే శ్రమిస్తుంది. మంచికోసం పోరాడిన పాండవుల్లా కాంగ్రెస్‌ నిజం కోసం పోరాడుతుంది. అందుకోసమే కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. 
  2. ఈ దేశ ఆత్మ కాంగ్రెస్‌ కార్యకర్తల రక్తంలో కలిసి ఉంది. మహాత్మ గాంధీ ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయనను ఈ దేశం మర్చిపోదు. మా నాయకుడు జైల్లో ఉన్న కాలంలో వాళ్ల నాయకుడు వీడీ సావర్కర్‌ బ్రిటిష్‌ వారి కరుణ కోసం లేఖలు రాసుకుంటూ కూర్చున్నారు.
  3. హత్య కేసులో నిందితుడైన వ్యక్తి బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాగలడు, కాంగ్రెస్‌ పార్టీకి కాదు. 
  4. దేశంలో అతిపెద్ద వ్యాపారవేత్తకు, ప్రధానమంత్రికి పోలిక ‘మోదీ’ అనే పేరు. ఒక మోదీ మరో మోదీకి రూ. 30,000 కోట్లు ఇస్తే, దానికి ప్రతిఫలంగా ఆ మోదీ ఈ మోదీకి మార్కెటింగ్‌ చేసుకునేందుకు, ఎన్నికల్లో పోరాడేందుకు డబ్బులు పెడతారు. 
  5. మేము మనుషులం, కొన్ని తప్పులు జరగోచ్చు. కానీ దేశాన్ని ముందుకు నడిపిస్తాం. కానీ మోదీజీ తనను తాను భగవంతుడి రూపంగా భావించుకుంటున్నారు. 
  6. మీరు రూ. 33,000 కోట్లు దోచుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని బీజేపీ ప్రభుత్వం రక్షిస్తుంది. ఆర్థిక మంత్రి ఎలాగో మౌనం వహిస్తారు. ఎందుకంటే ఆయన, ఆయన కూతురు పెట్టుబడిదారులు.
  7. కాంగ్రెస్‌ ప్రభుత్వం 126 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల రాఫెల్‌ ఒప్పందాన్ని మార్చి అంతే ధరకు  మోదీ  36 ఎయిర్‌ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేశారు. 
  8. గుజరాత్‌లో మా కార్యకర్తలకు టిక్కెట్టు ఇస్తే మోదీ సీప్లెన్‌లో తీరుగుతూ కన్పించారు. నిజంగా మా కార్యకర్తలకు అధికారం వస్తే ఆయనను సబ్‌మెరైన్‌లో చూడొచ్చు.
  9. కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పార్టీ ఒక గోడ ఉందని అనుకుంటున్నాను. దాన్ని బద్దలు కొట్టేందుకే నా మొదటి ప్రాధాన్యం.
  10. ప్రపంచం ముందు రెండు విజన్‌లు ఉన్నాయి, అమెరికన్‌, చైనీస్‌. కానీ ప్రపంచం ముందు ఇండియన్‌ విజన్‌ నిలపాలన్నది నా లక్ష్యం అన్నారు.

Advertisement
Advertisement