రాహుల్‌ గాంధీ ముందున్న సవాళ్లు | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ ముందున్న సవాళ్లు

Published Mon, Dec 11 2017 6:00 PM

Rahul Gandhi to face many challenges - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా రాహుల్‌ గాంధీ సోమవారం నాడు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీని పార్టీ అధిష్టానం నియమించినప్పుడే ‘నెహ్రూ–గాంధీ’ వారసుడిగా ఆయనే పార్టీకి కాబోయే అధ్యక్షుడనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఆ ఊహాగానాలు నిజమవుతాయని పార్టీ వర్గాలు భావించాయి. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడంతో ఆయన పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడంలో చాలా జాప్యం అయింది.

సోనియా గాంధీ అనారోగ్యం పాలవడం, పార్టీ ఓటమి కారణంగా పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పుడే స్వీకరించడానికి రాహుల్‌ గాంధీ చొరవ తీసుకోకపోవడంతో పార్టీలో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కొన్నాళ్లు కనిపించింది. పార్టీ సీనియర్‌ నాయకుల దగ్గరి నుంచి కార్యకర్తల వరకు ఒకలాంటి నిర్లిప్తతా ధోరణి కనిపించింది. ఈ రోజు రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో పార్టీలో అనిశ్చిత పరిస్థితికి తెరపడింది. కానీ అదే సమయంలో కొన్ని కొత్త ప్రశ్నలకు దారితీసింది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుంది? పార్లమెంట్, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాల కారణంగా పార్టీలో కమ్ముకున్న నైరాశ్యాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీ కార్యకర్తలను ఎలా ఆకర్షించగలరు? మొత్తంగా పార్టీలో నూతనోత్సహాన్ని నింపేందుకు ఆయన వద్ద ప్రణాళికలో ఏమైనా ఉన్నాయా? పార్టీని ఆయన ఏ దిశగా నడిపించగలరన్నవి కొత్త ప్రశ్నలు.

వీటన్నింటికన్నా ముందు తక్షణమే ఎదురవుతున్న ప్రశ్న రాహుల్‌ గాంధీ నాయకత్వాన జరిగిన ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌లో పార్టీ విజయం సాధిస్తుందా, లేదా? అన్నది. మొదటి విడత ఎన్నిలు ఇప్పటికే పూర్తయినందున 14న జరుగనున్న రెండో విడత ఎన్నికలపై పార్టీ దష్టి పెట్టింది. రెండో విడత ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరాజయం ఎదురయిందనే అపవాదు రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన తక కొత్త బాధ్యతల స్వీకరణకు 16వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా రాహుల్‌ గాంధీ నాయకత్వంపై గుజరాత్‌ అసెంబ్లీ ఫలితాలు అంతోఇంతో ప్రభావం ఉంటుంది. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ, ఆ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వానికి సవాల్‌గా నిలుస్తాయి.

పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైన ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆయన పార్టీ పునర్నిర్మాణానికి తీవ్రంగా కషి చేయాల్సి ఉంది. వీటిలొ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను సైతం పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో పార్టీకి దిశాదశ నిర్దేశం చేయాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉంది. ప్రస్తుతం మనుగడ సాగించడమే కష్టంగా ఉన్న పార్టీకి సైద్ధాంతిక వ్యూహాన్ని కూడా ఆయన స్పష్టం చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయాల్సి ఉంటుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ప్రచారం తీరు చూస్తుంటే రాహుల్‌ గాంధీ నాయకత్వ పరిణతి కొంత కనిపిస్తోంది. అయితే ఎన్నో విజయలను అందుకొని ఆయన ముందుకు పోవాల్సి ఉంది.

రాహుల్‌ గాంధీ రాజకీయ కార్యదర్శి ఎవరు?
పార్టీలో ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న రాహుల్‌ గాంధీకి అహ్మద్‌ పటేల్‌ ఎవరని? సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ అహ్మద్‌ పటేల్‌ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదగడం తెల్సిందే. ఎన్నడూ కూడా ప్రముఖుడుగా పైకి కనిపించని అహ్మద్‌ పటేల్‌ పార్టీ అంతర్గత నియామకాల్లో కీలక పాత్ర నిర్వహించారు. ఇప్పుడు రాహుల్‌ తరఫున అంతటి బాధ్యతను మోయగల వ్యక్తి ఎవరన్నది చర్చ. తన సొంత జట్టును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాహుల్‌ గాంధీకే ఉన్నప్పటికీ ఆయన తన టీమ్‌ను ఎంపిక చేసుకునేవరకు ఆయన పక్కన కార్యదర్శి బాధ్యతల్లో అహ్మద్‌ పటేల్‌ వ్యవహరించనున్నట్లు తెల్సింది. గుజరాత్‌ ఎన్నికల్లో కూడా ఆయన పాత్ర ఉంది. గుజరాత్‌లో పాటిదార్ల నాయకుడు హార్దిక్‌ పటేల్, ఓబీసీ నాయకుడు అల్పేష్‌ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నీష్‌ మెవానీలను పార్టీకి మద్దతుగా తీసుకొచ్చిందీ ఆయనే. రాహుల్‌ గాంధీ కార్యదర్శిగా ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజల్‌ మేకన్, పార్టీ ఎస్సీ విభాగం చీఫ్‌ కొప్పుల రాజు, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్ల విభాగం చీఫ్‌ రణదీప్‌ సుర్జీవాల్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement