తల్లి బాటలోనే తనయుడు రాహుల్‌ | Sakshi
Sakshi News home page

తల్లి బాటలోనే తనయుడు రాహుల్‌

Published Mon, Jan 8 2018 3:54 PM

Rahul Gandhi Following Sonia Gandhi Foot Steps - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలు ముగిసేవరకూ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు, ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీ, ప్రాదేశిక కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవుల్లో ప్రస్తుతమున్న వారిని ఇప్పట్లో మార్చరాదని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించారు. (సాక్షి ప్రత్యేకం) ఈ మేరకు శనివారం నాడు పార్టీ కార్యాలయం నుంచి ఓ పత్రికా ప్రకటన వెలువడింది. పార్టీ సంస్థ గత నియామకాలకు సంబంధించి ఇలాంటి పత్రికా ప్రకటన వెలువడడం అసాధారణమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఎన్నికయిన నేపథ్యంలో పార్టీని పునర్‌ వ్యవస్థీకరించడంలో భాగంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులతోపాటు ఇతర కమిటీల అధ్యక్షులను తొలగిస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగింది. ముఖ్యంగా సోనియా గాంధీ నియమించిన వృద్ధతరం మనుషులను తొలగించి తన తరం యువకులను తీసుకొస్తారనే ప్రచారం ఎక్కువగా జరిగింది.

ఈ నేపథ్యంలో తమ పదవులు తాత్కాలికమేనని భావించిన వివిధ కమిటీల అధ్యక్షులు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులు పని చేయడం మానేశారట. (సాక్షి ప్రత్యేకం) దాంతో పార్టీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన, పార్టీ కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగానే ప్రస్తుతం యథాతధా స్థితినే కొనసాగించాలని నిర్ణయించినట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సంస్థాగత ఎన్నికలు ముగిశాక అవసరమైన చోట మార్పులు, చేర్పులు ఉంటాయని ఆ వర్గాలు అంటున్నాయి. అది పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నికను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశం లాంఛనంగా ఆమోదించాక అలాంటి మార్పులు ఉండవచ్చని అంటున్నాయి. (సాక్షి ప్రత్యేకం) రాహుల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మేఘాలయ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీడీ లపంగ్‌ను తొలగించి, ఆయన స్థానంలో సెలెస్లైన్‌ లిండోగ్‌ను నియమించారు.

యువతరంలో అసంతృప్తి
పార్టీ పునర్‌ వ్యవస్థీకరణు ఆశించిన వారు రాహుల్‌ గాంధీ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురైన నేపథ్యంలో పార్టీలో సమూల మార్పులు జరుగుతాయని, ముఖ్యంగా యువతరానికి ఎక్కువ పదవులు దొరుకుతాయని ఆశించారు. (సాక్షి ప్రత్యేకం) ఈ ఒక్క ఏడాదే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాహుల్‌ యువతరానికి ప్రాధాన్యత ఇస్తారని ఆశించారు.

అయితే తల్లి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించిన రాహుల్‌ గాంధీ మాత్రం ఏ విషయంలోనూ తొందరపడకుండా తల్లి బాటలోనే నడవాలనికుంటున్నారు. పార్టీ నియామకాల్లో సోనియా గాంధీ ఎక్కువ వరకు యథాతధా స్థితినే కొనసాగించారు.

Advertisement
Advertisement