విద్వేషంతో దేశాన్ని చీల్చేస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

విద్వేషంతో దేశాన్ని చీల్చేస్తున్నారు..

Published Sat, Mar 17 2018 11:45 AM

Rahul Gandhi Introduction Speech In Congress 84th Plenary - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ దేశాన్ని అడ్డగోలుగా చీల్చేస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోపతాపాలు, విభజనవాదమే కనిపిస్తున్నదని, ఈ పరిస్థితులను మార్చి, మళ్లీ దేశాన్ని ఒక్కటిగా చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందన్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 84వ కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ ప్లీనరీకి అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యనాయకులు హాజరయ్యారు.

ప్లీనరీని ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రెండు ఉపన్యాసాలు చెయ్యాలి. ప్రారంభ ఉపన్యాసం కంటే ముగింపు ఉపన్యాసంలో అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతా. ఈ రెండు రోజులూ.. మీరు మాట్లాడేది సావధానంగా వింటూ, సూచనలు చేస్తూంటా. ఇప్పటికైతే ముఖ్యమైన విషయాలు రెండు చెప్పాలనుకుంటున్నా.. అధికార బీజేపీ ప్రజల మధ్య విద్వేశాన్ని అంతకంతకూ పెంచిపోషిస్తూ.. దేశాన్ని విడగొట్టాలని చూస్తోంది. వాళ్లను అడ్డుకోవాల్సింది మనమే. తిరిగి దేశాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలదే..’’ అని చెప్పారు.

కీలక అంశాలపై తీర్మానాలు: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో ఇదే ప్లీనరీ నుంచి శ్రేణులకు దిశానర్దేశం చేయనున్నారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. రైతాంగం స్థితిగతులు, ఆర్థిక, పారిశ్రామిక విధానం, విదేశీ వ్యవహారాలు, ఉపాధి తదితర అంశాలపై తీర్మానాలను ప్లీనరీ ఆమోదించనుంది.

Advertisement
Advertisement