అంబానీ క్యూలో నిలబడటం చూశారా..? | Sakshi
Sakshi News home page

అంబానీ క్యూలో నిలబడటం చూశారా..?

Published Tue, Oct 2 2018 7:14 PM

Rahul Gandhi Says PM Made You Stand In Line With Demonetisation - Sakshi

వార్ధా : గాంధీ జయంతి సందర్భంగా వార్ధాలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. రాఫెల్‌ డీల్‌, నిరుద్యోగం, పెట్రో భారాలు సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టారు. నోట్ల రద్దు సమయంలో పేదలు రోజువారీ అవసరాలకు నగదు కోసం క్యూల్లో నిలబడితే, సంపన్నులకు బ్యాంకు ద్వారాలను బాహాటంగా తెరిచారని దుయ్యబట్టారు. అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి వారిని మీరు క్యూలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.  బ్యాంకుల వెనుక డోర్‌ నుంచి వారు తమ నల్లధనాన్ని దర్జాగా తీసుకువెళ్లారని అన్నారు.

మోదీ సాయంతో బడా సంపన్నుల లక్షల కోట్ల రూపాయల నల్లదనం వైట్‌గా మారిందని  ఆరోపించారు. ప్రజలకు కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ సంపన్నులకు కాపలాదారుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాఫెల్‌ డీల్‌ నుంచి ప్రభుత్వ రంగ హెచ్‌ఏఎల్‌ను తప్పించి తన స్నేహితుడు అనిల్‌ అంబానీకి దాన్ని కట్టబెట్టారని విమర్శించారు. రిలయన్స్‌ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే సూచించిందని దసాల్ట్‌ కాదని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ చెప్పిన విషయం రాహుల్‌ ప్రస్తావించారు.

ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు తగ్గుతుంటే కేవలం భారత్‌లోనే ఇంధన ధరలు పెరుగుతున్నాయని మోదీ సంపన్నులకు చేస్తున్న ఊడిగం ఇదేనని విమర్శించారు. ప్రధాని మోదీ తన మనసులో మాట ప్రజలకు చెబుతుంటే కాంగ్రెస్‌ ప్రజల మనసులో మాటను వింటోందని రాహుల్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement