ఆ ఒక్క కుటుంబమే బాగుపడింది : రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క కుటుంబమే బాగుపడింది : రాహుల్‌ గాంధీ

Published Fri, Nov 23 2018 8:28 PM

Rahul Gandhi Slams TRS Govt In Medchal Public Meeting - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, సోనియా గాంధీ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తి తన ఇష్టానుసారం పాలన చేసి ప్రజల కలల్ని కాలరాశారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. నాలుగున్నరేళ్లలో కేవలం ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. అటువంటి రాక్షస పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ టీజేఎస్‌, సీపీఎం, టీడీపీలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిందని పేర్కొన్నారు.

తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘తెలంగాణ ఆకాంక్షల్ని అర్థం చేసుకుని సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. కానీ మీ ఓట్లతో గద్దెనెక్కిన ఆ వ్యక్తి కేవలం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాడు. మీ కలల్ని నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత ప్రజాకూటమి తీసుకోబోతోంది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనలను, అభిప్రాయాలను స్వీకరించి తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, యువత పరిస్థితి కూడా అలాగే ఉంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాగానే రైతులు, మహిళల సమస్యలు తీరుస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తుంది’  అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement