రాష్ట్రంలో గరుడ పురాణం నడుస్తోంది..!

29 Oct, 2018 04:17 IST|Sakshi

కాల్‌షీట్‌లు లేని కమెడియన్‌ చెప్పే కథతో రాజకీయం చేస్తారా..

సీఎంపై విరుచుకుపడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

సాక్షి, గుంటూరు /గన్నవరం: దేవాలయాల్లో నడవాల్సిన గరుడ పురాణం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయపార్టీల్లో నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు. కాల్‌షీట్‌లులేని కమిడియన్‌ చెప్పే గరుడ పురాణం కథను చదువుతూ సీఎం చంద్రబాబు రాజకీయం చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గుంటూరులో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగిన మహిళా సాధికారిత– మహిళా సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అంతకు ముందు ఆయన గన్నవరం విమానాశ్రయంలోనూ మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళల అభిమానంతోనే మోదీ ప్రధాని అయ్యారని, వారి కష్టాలు తీర్చేందుకు స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఏపీలో మరుగుదొడ్లను లెక్కల్లోనే చూపుతున్నారని ఆరోపించారు. గతంలో పశువుల గడ్డిని తిన్న సీఎంను చూశామని, ఆంధ్రా సీఎం మరుగుదొడ్లలో సైతం దోపిడీకి పాల్పడటం దారుణమన్నారు. కేంద్రం పేదల కోసం ఇచ్చే నిధుల్లో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోదని, విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్‌కు ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటన
సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి ఊడిగం చేసేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం కాదని రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న పార్టీలు ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోతుండడంతో వారిని బుజ్జగించేందుకు చంద్రబాబును రంగంలోకి దింపినట్లు ఆరోపించారు. ఎన్‌టీఆర్‌ కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేయాలనే ఆలోచనతో పార్టీ పెడితే, చంద్రబాబు మాత్రం మాయావతి వద్దకు వెళ్లి సాగిలపడి కాంగ్రెస్‌కు మద్దతివ్వమని బతిమాలుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చర్యలతో ఎన్‌టీఆర్‌ ఆత్మ హోషిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రహత్కర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి పురంధరేశ్వరి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు