అత్యాచారం.. రాజకీయ అంశం ఎందుకు కాదు? | Sakshi
Sakshi News home page

అత్యాచారం.. రాజకీయ అంశం ఎందుకు కాదు?

Published Fri, May 11 2018 8:48 AM

Rape a political issue says Rahul Gandhi  - Sakshi

సాక్షి, బెంగళూరు:  ‘అత్యాచారాలు రాజకీయాలకు సంబంధం లేదు. అత్యాచారాలను రాజకీయం చేయొద్దు’ అన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అత్యాచారాలు ముమ్మాటికీ రాజకీయ అంశమేనని అన్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామన్నారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామన్నారు. అత్యాచారం రాజకీయ సమస్య ఒక్కటే కాదని.. అది జాతీయ సమస్య అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కానీ మోదీ రాజకీయాలకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అత్యాచారం అనేది వారి వ్యక్తిగత విషయమని విలేకరుల సమావేశంలో మోదీ వెల్లడించడం సరికాదన్నారు.

నాలుగేళ్ల అభివృద్ధిపైమోదీ మాట్లాడగలరా?
నాలుగేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి గురించి ఒక్క 15 నిమిషాలు ఆయన మాతృభాషలోనైనా మోదీ చెప్పగలరా అని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద దళితులకు ఏ మేరకు నిధులు కేటాయించిందో అందులో సగం వంతు ఒక్క కర్ణాటక ప్రభుత్వమే కేటాయించిందని స్పష్టం చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పారు. మోదీ అవలంభిస్తున్న విదేశాంగ విధానాలు దేశాన్ని ఆత్మ రక్షణలో పడేయడం ఖాయమన్నారు. తన మీదతో పాటు అందరి మీద మోదీ కోపం, అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కన్నడిగుల మనోభావాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది. బెంగళూరును సిలికాన్‌ వ్యాలీగా మార్చడంలోకాంగ్రెస్‌ పార్టీ కృషి ఉందన్న విషయం ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ... రాష్ట్రంలో మరోసారి అధికారంలోరి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్, కేపీసీసీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

భారీ మెజారిటీతో గెలుస్తాం
మైసూరు : శనివారం జరుగన్ను ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి తాము భారీ మెజారిటీ గెలిచి తీరతామంటూ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల ప్రచారాలకు చివరిరోజు కావడంతో గురువారం మధ్యాహ్నం మైసూరుకు చేరుకున్న సీఎం సిద్దరామయ్య విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సీఎం సిద్దరామయ్యకు, జేడీఎస్‌ అభ్యర్థి జీటీ.దేవేగౌడకు మధ్య హోరాహోరీ ఎన్నికలంటూ జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య ఛలోక్తులు విసిరారు. గత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన అనంతరం తాము చూసిన, ఎదుర్కొన్న వందలాది మంది నేతల్లో జీటీ.దేవేగౌడ ఒకరని ఒక సొసైటీ సభ్యుడిని తమకు పోటీదారుడిగా భావించడంలోనే కుమారస్వామి ఆలోచనల స్థాయేంటో అర్థమవుతోందన్నారు.

Advertisement
Advertisement