అధికార పార్టీకి అభ్యర్థులు కావలెను | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి అభ్యర్థులు కావలెను

Published Sat, Mar 2 2019 3:45 AM

Ruling party needs candidates - Sakshi

అధికార  పార్టీ టిక్కెట్‌ కోసం నేతలు ప్రయత్నించడం రాజకీయాల్లో సాధారణం. కానీ టీడీపీ పిలిచి మరీ టిక్కెట్‌ ఇస్తామంటున్నా వద్దంటూ ఆ పార్టీ నేతలే దూరం జరుగుతుండటం రాష్ట్రంలో తాజా పరిణామం. సర్వేలు చేసుకుని ఫలితాలను బేరీజు వేసుకుంటున్న అధికార పక్ష నేతలు ఆ పార్టీ తరఫున పోటీ చేయలేమని పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు సీనియర్లతోపాటు సాధారణ నేతలు కూడా వెనుకంజ వేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.  – సాక్షి, అమరావతి బ్యూరో

టిక్కెట్‌ ఇస్తామంటున్నా సరే నేతలు వద్దని తెగేసి చెప్పడం రాష్ట్రంలో అధికార టీడీపీ ఎదుర్కొంటున్న సంకట స్థితిని రుజువు చేస్తోంది. ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు, ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట నుంచి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డికి ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా టిక్కెట్టు ఇస్తామని చెప్పింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యయం కూడా తానే భరిస్తానని చంద్రబాబు మల్లికార్జునరెడ్డికి హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే క్యాబినెట్‌ మంత్రి హోదా పదవి కూడా ఇస్తానని ఆశ చూపారు. కానీ మేడా మల్లికార్జునరెడ్డి మాత్రం తాను టీడీపీ తరఫున పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు.  

సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఆదినారాయణరెడ్డి తదితరులు ఎన్నిసార్లు మంతనాలు జరిపినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని వారి ఎదుటే కుండబద్దలు కొట్టారు. ప్రజాభిప్రాయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేస్తూ టీడీపీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో  చేరారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా టీడీపీకి ఝలక్‌ ఇచ్చారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున  చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2014లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి  గెలిచారు. తరువాత అధికార టీడీపీలో చేరారు. కాగా క్షేత్రస్థాయి రాజకీయాల్లో పట్టున్న ఆయన ఈసారి ప్రజాభిప్రాయం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని గుర్తించారు.

ప్రభుత్వం గొప్పగా చెబుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసించడం లేదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో చర్చించిన అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎమ్మెల్యే ఆమంచి నిర్ణయించుకున్నారు. ఈ దశలో ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సీఎం చంద్రబాబు చీరాల టిక్కెట్టు ఇస్తామనడంతోపాటు గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ఆశ చూపించారు. తన మాట వినకుంటే ఆయన నియోజకవర్గంలో పోలీసు అధికారులను బదిలీ చేసి వేధిస్తానని పరోక్షంగా హెచ్చరించారు. అయితే ఆమంచి మాత్రం చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపులకు ఏమాత్రం లొంగలేదు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ప్రజాభిప్రాయాన్ని గుర్తించి టీడీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్‌బై
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా అదే దారిలో ఆ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చారు. ఎంపీ అవంతికి మళ్లీ అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఇస్తామని, ఒకవేళ ఆయన అడిగితే భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా అవకాశం ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. చంద్రబాబు ప్రకటించిన పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందంటూ ఇంటలిజెన్స్‌ సర్వేలు చెబుతున్నాయని నమ్మించేందుకు ప్రయత్నించారు. మంత్రి గంటాను ఎంపీగా పోటీ చేయిస్తామని, ఎన్నికల అనంతరం అవంతికి మంత్రి పదవి ఇస్తామని కూడా ఆశ చూపించారు. కానీ ఆయన చంద్రబాబు మాయలో పడలేదు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఆయన్ను ప్రభావితం చేసింది. దీంతో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరా>రు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నారు. అమలాపురం ఎంపీ రవీంద్రబాబును పార్టీలో కొనసాగేలా చేయడానికి టీడీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆయనకు అమలాపురం ఎంపీగా గానీ లేదంటే ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గానీ టీడీపీ టిక్కెట్‌ ఇస్తామని చెప్పింది. ఎన్నికల వ్యయం మొత్తం పార్టీ భరించడమే కాకుండా ఈసారి దళిత కోటాలో మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. కానీ ఈ ఎత్తుగడలేవీ ఫలించలేదు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ఒంగోలులో టీడీపీకి అభ్యర్థి కరువు..: టీడీపీకి చెందిన మరికొందరు కీలక నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని తేల్చి చెబుతుండటం చంద్రబాబును కలవరపరుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డి తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో టీడీపీ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టమైంది. దీంతో ఆయన తాను ఒంగోలు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పారు. మాగుంట శ్రీనివాసులరెడ్డిని  చంద్రబాబు పిలిపించుకుని ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఎంత కోరినా ఫలితం దక్కలేదు. దీంతో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేక అధికార టీడీపీ సతమతమవుతోంది. 

ఓడిపోయే చోట్ల ఎలా పోటీ చేస్తాం?
పార్టీ అభ్యర్థులను నిర్ణయించేందుకు చంద్రబాబు అర్ధరాత్రి వరకూ సమీక్షా సమావేశాలు జరుపుతున్నా ఫలితం శూన్యమని పేర్కొంటున్నారు. కీలకమైన ఎంపీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఎవరూ సంసిద్ధత తెలపకపోవడం గమనార్హం. టీడీపీ బలహీనంగా ఉన్న రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. రాజంపేట నుంచి చిత్తూరు ఎంపీ డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులును పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో డీకే సత్యప్రభ అభ్యర్థిత్వాన్ని తాజాగా పరిశీలిస్తున్నారు. కానీ డీకే కుటుంబ సభ్యులు ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. టీడీపీ ఓడిపోయే నియోజకవర్గంలో తామెందుకు పోటీ చేయాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. 

ఎన్నికల ఖర్చు భరిస్తామంటున్నా...
నెల్లూరు లోక్‌సభ నియోజవర్గం నుంచి కూడా ఎంపీగా పోటీచేసేందుకు టీడీపీ నేతలు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురి నేతల పేర్లపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు తదితరులతో చర్చించినప్పటికీ ఎంపీగా పోటీ చేసేందుకు సానుకూలత వ్యక్తం చేయలేదని సమాచారం. ఇక్కడ కూడా ఎంపీ అభ్యర్థి ఎన్నికల వ్యయం అంతా మంత్రి నారాయణ ద్వారా టీడీపీయే భరిస్తుందని చంద్రబాబు ఎంతగా చెప్పినప్పటికీ ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఎంపీ అభ్యర్థిపై నిర్ణయాన్ని చంద్రబాబు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కూడా టీడీపీ నేతలు ముందుకు రావడం లేదని సమాచారం. నరసాపురం నుంచి కూడా పోటీకి టీడీపీ నేతల్లో స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, నరసాపురం లోక్‌సభ నియోజవర్గాల అభ్యర్థులపై నిర్ణయాన్ని చంద్రబాబు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ హడావుడిగా మభ్యపెట్టే ఎత్తుగడలకు తెర తీసినా అవి ఏమాత్రం ఫలిచడం లేదు. ప్రజల్లో టీడీపీ సర్కారు పట్ల ఏమాత్రం సానుకూలత లేదని గత నెలన్నర రోజుల్లో ప్రభుత్వంతోపాటు టీడీపీ నేతలు నిర్వహించిన సర్వేల్లో తేటతెల్లమైంది. ఇంటెలిజెన్స్‌ విభాగంలోని తమ సన్నిహితులతో కూడా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటూ కూపీ లాగుతుండటంతో అసలు విషయం వారికి అవగతమవుతోంది. రాజధాని నిర్మాణంలో వైఫల్యం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం పట్ల టీడీపీపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఏడాదిన్నర క్రితమే నవరత్నాల కింద ప్రకటించిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో భరోసా నెలకొంది. ఎన్నికల ముంగిట వాటిని కాపీ కొట్టి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేస్తున్నారు. 

కొనకళ్ల, మురళీమోహన్‌ ‘నో’ 
మచిలీపట్నం టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ కొనకళ్ల నారాయణ ఈసారి తాను ఎంపీగా పోటీ చేయబోనని చంద్రబాబుకు తేల్చిచెప్పారు. ఆయన్ని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బందరు ఎంపీ అభ్యర్థిపై నిర్ణయాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేస్తున్నారని సమాచారం. రాజమండ్రి నుంచి మురళీమోహన్‌గానీ ఆయన కోడలిని గానీ పోటీకి దించాలని  చంద్రబాబు  నిర్ణయించారు. కానీ ఆ కుటుంబం అందుకు ఒప్పుకోకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement