కమీషన్ల కోసమే ‘మిషన్‌ భగీరథ’ | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసమే ‘మిషన్‌ భగీరథ’

Published Fri, Apr 13 2018 1:39 PM

Shabbir Ali Fires On TRS Governemnt - Sakshi

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): కమీషన్‌ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వజ్జపల్లి తండా, యాచారం గ్రామాల్లో జరిగిన పెళ్లి వేడుకలకు ఆయన హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లక్షా 54వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అట్టి పనులను ఆపేశారన్నారు. ఈ పనులు చేస్తే షబ్బీర్‌కు ఎక్కడ పేరు వస్తదోనని భయపడి పోయారన్నారు. పలుమార్లు ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోవడం వల్ల మళ్లీ పనులు ప్రారంభించారన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజనులకు సంబంధించిన సాగు భూములను లాక్కుంటారన్నారు.  
గిరిజనులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్‌కు పట్టంగట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరిట కేవలం వజ్జపల్లి తండాలో 40ఇళ్లను ఒకేసారి కట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. యాచారం శివారులో నిర్మిస్తున్న ప్రాణహిత చెవెళ్ల కెనాల్‌ నిర్మాణంలో భాగంగా 40 ఎకరాల సాగు భూమిని రైతులు కోల్పోతున్నారన్నారు. ఆ భూమికి ప్రభుత్వం  రైతుకు సమ్మతమైన  ఒక ధరను నిర్ణయించి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీ నల్లమడుగు సురేందర్, నాయకులు సుభాష్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, జమునా రాధోడ్, మండలాధ్యక్షుడు బద్దం శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్టీసెల్‌ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌ నాయక్, యాచారం సర్పంచ్‌ సాజ్య నాయక్, నాయకులు బాల్‌రాజ్, కైలాస్‌ శ్రీనివాస్, ప్రతాప్‌సింగ్, నాయిని సాయన్న, అడ్డగుల్ల సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాగునీటి సమస్యను తీర్చండి సారూ...
తండాలో గత రెండేళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తాగునీటి సమస్య లేకుండా చూడాలని గురువారం వజ్జపల్లి తండాకు వచ్చిన షబ్బీర్‌అలీకి తండాకు చెందిన మహిళలు మొరపెట్టుకున్నారు. తండాకు 3కి.మీ మీటర్ల దూరంలో  బోరు వేస్తే నీళ్ల వస్తాయని, అక్కడి నుంచి పైప్‌లైన్‌ వేయించాలని కోరారు. బోరు వేయాలని తర్వాత పైప్‌లైన్‌ సంగతి నేను చూసుకుంటానన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement