అజిత్‌ పవార్‌ దారెటు..! | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌ దారెటు..!

Published Tue, Nov 26 2019 4:57 PM

Sharad Pawar May  Not Invite Ajit Pawar - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర సంక్షోభానికి మూల కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మూడు రోజుల వ్యవధిలోనే సంచలనంగా మారారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన తరుణంలో బీజేపీకి మద్దతు ప్రకటించి రాజకీయాలను ఊహించని మలుపు తిప్పారు. అనంతరం తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా వస్తారని భావించిన అజిత్‌.. అత్యాశకు పోయి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే దశాబ్దాల రాజకీయ అనుభవం, వ్యూహ చతురతలో దిట్టగా పేరొందిన శరద్‌ పవార్‌ ముందు అజిత్‌ కుప్పి గంతులు ఏమీ పనిచేయలేదు. అజిత్‌ నిర్ణయానికి షాకైన.. ఆ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన చాతుర్యంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారు. మొత్తం 54 ఎమ్మెల్యేలలో దాదాపు అందరినీ సమీకరించుకోవడంలో శరద్‌ విజయం సాధించారు. దీంతో పార్టీని చీల్చిన అజిత్‌ చివరికి ఒంటరిగా మిగిలారు. (సీఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా)

అజిత్‌ను శరద్‌ నమ్ముతారా?
ఈ నేపథ్యంలో అజిత్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా శరద్‌ పావులు కదిపారు. పలువురు కీలక నేతలను పంపి.. ఆయనతో చర్చలు జరిపారు. అంతకీ అజిత్‌ వెనక్కితగ్గకపోవడంతో శరద్‌ పవార్‌ భార్యను రంగంలోకి దింపి చివరికి విజయం సాధించారు. ఆమె అజిత్‌తో సమావేశమైన గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరమే సీఎం పదవి నుంచి దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా తప్పుకోక తప్పలేదు.అయితే శరద్‌ పవార్‌పై తిరుగుబాటు చేసిన అజిత్‌ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తదుపరి ఏర్పడే శివసేన ప్రభుత్వంలో ఆయనకు స్థానం లభిస్తుందా? లేక పార్టీని చీల్చినందుకు పక్కన పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీ శాసనసభాపక్ష పదవి నుంచి ఇప్పటికే తొలగించిన శరద్‌.. మరోసారి అజిత్‌ను నమ్ముతారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కూటమి నేతను  ఎన్నుకునేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. సాయంత్రం 6 గంటకు ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు.  ఈ భేటీలో అజిత్‌ భవితవ్యంపై కూడా చర్చించే అవకాశం ఉంది. (పదవికి అజిత్‌ పవర్‌ రాజీనామా)

అయితే సంజయ్‌ రౌత్‌ లాంటి వాళ్లు మాత్రం అజిత్‌ ఎన్సీపీలోనే ఉంటారని ఇది వరకే ప్రకటించారు. బీజేపీతో చేతులు కలిపిన అనంతరం అజిత్‌తో రాయబారం నడిపిన ఎన్సీపీ నేతలు తిరిగి రావాల్సిందిగా కోరారని, శివసేన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా అప్పగిస్తామని భరోసా ఇచ్చినట్లు ఎన్సీపీ వర్గాల సమాచారం. వారి ప్రతిపాదనలకు ఒప్పుకున్న తరువాతనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే అజిత్‌ రాజీనామాపై శరద్‌ ఇంకా స్పందించలేదు. శివసేన, కాంగ్రెస్‌ నేతలు కూడా ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement