శివసేనపై నిప్పులు చెరిగిన పవార్‌ | Sakshi
Sakshi News home page

శివసేనపై నిప్పులు చెరిగిన పవార్‌

Published Sat, Oct 12 2019 7:37 PM

Sharad Pawar Slams Amit Shah  - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. శివసేన ఎన్నికల హామీలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పది రూపాయలకే ఉచిత భోజన పథకాన్ని శివసేన ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో వంట వండుతారా లేక ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో బీజీపీ, శివసేన ప్రభుత్వం ప్రారంభించిన జుంకా బాకర్‌ పథకంలో శివసేన కార్యకర్తలు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో తెలుసునని వ్యాఖ్యానించారు.  

కాగా ఎన్నికల్లో ప్రతిపక్షలు పోరాడటం లేదన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆరోపణలను శరద్‌ పవార్‌ ఖండించారు. నిజంగానే ప్రతిపక్షాలు అంత బలహీనంగా ఉన్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమిత్‌ షా కేవలం అధికరణ 370రద్దును మాత్రమే ప్రస్తావిస్తున్నారని, నిరుద్యోగం, అభివృద్ధి, మహిళల పరిరక్షణ, వ్యవసాయం తదితర అంశాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో 16,000 మంది ఆత్మహత్య చేసుకున్నా వారికి పట్టడం లేదని ఆవేదని వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement