అసందర్భ ప్రేలాపనలు ఎందుకు? | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సిన్హా హితవచనాలు

Published Fri, May 11 2018 11:59 AM

Shatrughan Sinha Slams PM Modi For Acerbic Speeches In Karnataka - Sakshi

పట్నా: బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని దుందుడుకు ప్రసంగాలను ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీపై, పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై ప్రధాని అసందర్భ ప్రేలాపనలు తగవని మండిపడ్డారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసే వేళ ధనబలం కంటే జనబలమే చివరిగా గెలుస్తుందన్నది గుర్తెరగాలని మోదీకి వరుస ట్వీట్లలో హితవు పలికారు.

బిహార్‌ నుంచి కర్ణాటక ఎన్నికల వరకూ తనను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆహ్వానించకపోయినా పార్టీ సానుభూతిపరుడిగా తాను సూచనలు చేస్తున్నానని,  ప్రచారంలో పరిమితి దాటి వ్యక్తిగత దాడులు చేయడం తగదని అన్నారు. ప్రసంగాలు హుందాతనంగా, మర్యాదకరంగా సాగాలని ప్రధానికి సిన్హా సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు పీపీపీ (పాండిచేరి, పంజాబ్‌, పరివార్‌) మిగులుతాయని ప్రధాని వ్యాఖ్యానించడాన్ని సిన్హా తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మే 5న జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ శత్రుఘ్నసిన్హా ప్రధాని మోదీ విధానాలను తప్పుపడుతూ బహిరంగంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. 

Advertisement
Advertisement