హోదాపై బాబు దొంగాట | Sakshi
Sakshi News home page

హోదాపై బాబు దొంగాట

Published Fri, Mar 30 2018 12:38 PM

Shilpa Chakrapani reddy Fires On CM Chandra  Babu Naidu - Sakshi

ఆదోని టౌన్‌:ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు..రోజుకోమాట, పూటకో అబద్ధం చెబుతూ దొంగాట ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆదోని పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా సంజీవని కాదని ఒక సారి.. దాని వల్ల ఒరిగిందేమీ లేదని మరోసారి.. ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఇంకోసారి..పూటకో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. మతిస్థిమితం కోల్పోయిన బాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని..టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబు తన 40 ఏళ్ల రాజకీయంలో వెన్నుపోట్లు పొడవడం..మోసం చేయడం అనుభవంగా గడించారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా   కొనుగోలు చేసి ..మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబుకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. 

ప్రజాదరణ చూసి ఓర్వలేక..  
ప్రజాసంకల్ప యాత్రలో తమ పార్టీ అధినేత  వైఎ‹స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేయడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. టీడీపీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించకుండా దోబూచులాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వారి ఆటలు ఇక సాగబోవన్నారు.  

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు..
తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్,  బీజేపీలను విమర్శించేందుకే అసెంబ్లీని వేదికగా మార్చడం శోచనీయమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా..అసెంబ్లీని  టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టించడం తగదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దెబ్బకు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. టీడీపీ భూస్థాపితమై..త్వరలోనే ప్రజాప్రభుత్వం వస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాఘవరెడ్డి, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ మధుసూదన్, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు సురేంద్రరెడ్డి, కల్లుపోతుల సురేష్, కేసీ నాగన్న, నర్సింహ, బసవ, మాజీ సర్పంచ్‌ ఈరన్న, రవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement