కూటమిలో చేరే ప్రసక్తే లేదు...! | Sakshi
Sakshi News home page

కూటమిలో చేరే ప్రసక్తే లేదు...!

Published Tue, Jun 12 2018 9:18 AM

Shiv Sena Refused To Be A Part Of Opposition Alliance Against BJP - Sakshi

సాక్షి, ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన పార్టీ మరోసారి స్పష్టం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్న కూటమి (మహా అఘాది)లో చేరాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ శివసేనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శివసేన నేత హర్షల్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ..  ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని కూల్చడం ఇష్టంలేకే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో శివసేన ఇంకా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నందు వల్లే సామాన్యులు, రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం పోరాడటం సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వాన్ని కూల్చడానికే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని, వారి ఆటలో  పావుగా మారేందుకు శివసేన సిద్ధంగా లేదన్నారు.

శివసేనకు చెందిన మరో నేత మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందామన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే నుంచి బయటికి రావాలని ఉద్ధవ్‌ ఠాక్రే భావిస్తున్నారని తెలిపారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించారే తప్ప బీజేపీని వీడిన తర్వాత మరో పార్టీతో జతకట్టే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

కాగా బీజేపీ వ్యతిరేక కూటమిలో శివసేన చేరడానికి సుముఖంగా లేదన్న వార్తలపై ముంబై కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ స్పందించారు. శివసేన, కాంగ్రెస్‌ పార్టీ రెండు వేర్వేరు ధ్రువాలని, కాంగ్రెస్‌ ఏర్పాటు చేసే కూటమిలో శివసేన భాగస్వామ్యమయ్యే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement