సిద్ధారామయ్య ఓడిపోతారా..? | Sakshi
Sakshi News home page

సిద్ధారామయ్య ఓడిపోతారా..?

Published Wed, Apr 4 2018 9:38 AM

Siddaramaiah Risking By Competing From Chamundeshwari - Sakshi

సాక్షి, బెంగుళూరు : సొంత పట్టణం మైసూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఐదు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా సిద్ధారామయ్య 2018 ఎన్నికల్లో తాను పోటీ చేయనున్న చాముండేశ్వరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో రామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని ప్రజలు సిద్ధారామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదంతా జేడీఎస్‌ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ తప్పని రామయ్య వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాల్సింది ప్రభుత్వమేనని వారంతా మండిపడ్డారు. ఈ ఘటనపై మాట్లాడిన కొందరు కాంగ్రెస్‌ నేతలు చాముండేశ్వరి నుంచి సిద్ధారామయ్య పోటీ చేయడం రిస్కేనని అభిప్రాయపడ్డారు. తనయుడిని సులువుగా గెలిపించుకునేందుకు సిద్ధా ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సిద్ధారామయ్య గత ఎన్నికల్లో పోటీ చేసిన వరుణ నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు డా. యతీంద్ర బరిలోకి దిగుతున్నారు.

1983 నుంచి 2008ల మధ్య చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ధారామయ్య ఐదు సార్లు(స్వతంత్ర అభ్యర్థిగా, జనతా పార్టీ తరఫున, జనతా దళ్‌ తరఫున, జేడీఎస్‌ తరఫున, కాంగ్రెస్‌ తరఫున) గెలుపొందారు. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ అనంతరం వ్యూహాత్మంగా ఆలోచించి రెండు సార్లు కాంగ్రెస్‌ తరుఫున వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్లీ చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, ఒకప్పటి తన శిష్యుడు సిద్ధారామయ్య ఓటమికి హెచ్‌డీ దేవెగౌడ వ్యూహాలు రచిస్తున్నారు.

కాగా, ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అంతగా పట్టు లేదు. దీంతో రామయ్యపై పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీఎస్‌లు ఏకమై ముఖ్యమంత్రిని ఓడించాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇవే తనకు ఆఖరి ఎన్నికలని, ఈసారి కూడా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సిద్ధారామయ్య కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement