దేశాన్ని దోచుకుంటున్నారు | Sakshi
Sakshi News home page

దేశాన్ని దోచుకుంటున్నారు

Published Tue, Dec 4 2018 6:24 AM

sitaram yechury slams on kcr, narendra modi - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌/కారేపల్లి: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలసి దేశాన్ని దోచుకుంటున్నారని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి, మహబూ బాబాద్‌ జిల్లా కేంద్రంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మతోన్మాద రాజకీయాలను పెంచింది మోదీ యేనని, కేవలం ఓటు బ్యాంకు కోసమే హిందూవాదంతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల దేశ ఐక్యతకు పెను ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్‌ కూడా మతోన్మాదాన్ని సమర్థించడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక దోపిడీ పెరిగిందని అన్నారు.

బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బానోత్‌ మోహన్‌లాల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని పిలుపునిచ్చారు. బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, అబద్ధాల కోరు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. సోనియాను తెలంగాణ తల్లి అని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జీలు చేసి, కేసులు పెట్టారని మండిపడ్డారు. టీజేఎస్, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు, గద్దర్, మందకృష్ణ మాదిగ కలసి ఊరేగుతున్నారని, కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.

దేశం చూపు తెలంగాణవైపు..
దేశవ్యాప్తంగా ఖమ్మంకు ఎర్ర జిల్లాగా గుర్తింపు ఉందని, ఇక్కడి ఫలితాలు తెలంగాణలోనే కాక.. దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని కారేపల్లి సభలో సీతారాం ఏచూరి అన్నారు. దేశమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందని, ఈ ఎన్నికలు పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రంను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమయ్య తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement