పులకించిన పల్లె.. | Sakshi
Sakshi News home page

పులకించిన పల్లె..

Published Thu, Nov 30 2017 2:17 AM

solid welcome to ys jagan at every step of padayatra - Sakshi

ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పల్లె పులకించింది.. రాజన్న బిడ్డ పాదయాత్ర ద్వారా తమ గ్రామాలకు రావడంతో పల్లె జనం సంబరపడ్డారు. అక్కచెల్లెళ్లయితే వెల్లువెత్తారు. హారతులిస్తూ.. ఆహ్వానిస్తూ.. ఆశీర్వదిస్తూ.. నీరాజనాలు పలికారు. బిడ్డల్ని చంకనేసుకుని కొందరు.. కూలి పనులు మానుకుని మరికొందరు.. ఎర్రటి ఎండలో గంటల తరబడి ఎదురు చూస్తూ ఇంకొందరు.. ఇలా అడుగడుగునా జననేతకు స్వాగతం పలికారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 21వ రోజు బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగింది. మంగళవారం రాత్రి విడిది చేసిన అయ్యకొండ క్రాస్‌ నుంచి బయలుదేరిన జగన్‌ సమీపంలోని గంజిహళ్లి గ్రామంలోకి ప్రవేశించినపుడు అక్కచెల్లెళ్లు భారీ ఎత్తున రోడ్డుకిరువైపులా నిలుచుని స్వాగతం పలికారు. ఆయన పాదయాత్ర సాగిన బైలుప్పల, బండమీది అగ్రహారం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.  

నిరాశ వద్దు..  
గంజిహళ్లి గ్రామంలోకి ప్రవేశించి.. అవతలి వైపునకు చేరుకునేందుకు జగన్‌కు సుమారు రెండున్నర గంటలకు పైగా సమయం పట్టింది. గ్రామం ప్రారంభంలోనే అక్కచెల్లెళ్లు భారీగా తరలివచ్చారు. డ్వాక్రా రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని, అధికార పార్టీకి ఓటేయలేదని ఇళ్లు మంజూరు చేయడంలేదని పలువురు జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమకు పింఛన్లు ఇవ్వడంలేదని పలువురు అవ్వాతాతలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇవేమీ చంద్రబాబు చేయడు.. మీరు నిరాశ చెందొద్దు.. ఏడాది ఓపిక పట్టండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు మీకందరికీ మేలు చేస్తాం..’ అని వారికి జగన్‌ భరోసా ఇచ్చారు. నవరత్నాల గురించి వారికి వివరించారు. పిల్లలను పాఠశాలలకు పంపాలని.. వారికి పదే పదే విజ్ఞప్తి చేశారు.

గంజిహళ్లి పరిసరాల్లోని గుమ్మరాల ప్యాలకుర్తి, ఎల్‌.బండ, అయ్యకొండ గ్రామాల నుంచి కూలి పనులు మానుకుని మరీ పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ వారందరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్‌ సీపీ కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ఆధ్వర్యంలో వాల్మీకులు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌ను కలిశారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్‌చంద్రబోస్, ఇతర నేతలు జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. జగన్‌కు తలపాగా చుట్టిన వాల్మీకులు విల్లంబును బహూకరించగా జగన్‌ దానిని ఎక్కుపెట్టారు. ఊరు మధ్యలోకి బడేషా వలీ దర్గా సమీపంలోకి వచ్చినపుడు ముస్లింలంతా గుమికూడి సంప్రదాయకమైన టోపీని ధరింపజేసి ఆయన వెంట నడిచారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత బైలుప్పల, బండమీద అగ్రహారంలో కూడా ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్కడ జగన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బండమీద అగ్రహారం దాటాక 300 కిలోమీటర్ల దూరాన్ని జగన్‌ పూర్తిచేశారు. ఈ సందర్భంగా అభిమానులు జగన్‌తో అక్కడ ఓ కానుగ, వేప మొక్కను నాటించారు.  

ప్రభుత్వం అన్యాయం చేస్తోంది సార్‌.. 
ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆవేదన 
‘సార్‌.. పదేళ్లుగా పని చేస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయడం లేదు’ అని గోనెగండ్ల మండలానికి చెందిన ఏపీ సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు భారతి, తిమ్మప్ప, చెన్నకేశవులు, రామాంజనేయులు, పుల్లన్న, విజయరాణి, కవిత, రవి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గోనెగండ్ల నుంచి గంజిహళ్లి వెళ్లే ప్రధాన రహదారిలో వారు వైఎస్‌ జగన్‌ను కలిసి ప్రభుత్వం తమను ఔట్‌సోర్సింగ్‌ కిందకు మార్చాలని చూస్తోందని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతామని విన్నవించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరూ.. 
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి (వీఆర్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు సుభాస్‌చంద్రబోస్‌ జగన్‌ను కోరారు. వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరు సిద్ధయ్య, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు కొండయ్య, ఉద్యోగులు, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన్‌ తదితరులు గంజిహళ్లిలో జగన్‌కు వినతిపత్రంఇచ్చారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చట్టసభల్లో చిత్తశుద్ధితో పోరాడతామని  జగన్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాల్మీకులు ఇచ్చిన విల్లంబును జననేత ఎక్కుపెట్టారు. 

చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నా.. 
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం:  ‘అన్నా.. మా ఊర్లో వర్షాకాలమే పనులుంటాయ్‌.. డిసెంబర్‌ వచ్చిందంటే బతుకుదెరువు కోసం మా తల్లిదండ్రులు కడప, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరుకు వలస వెళ్తారు. మమ్మల్ని కూడా బడి మాన్పించి వారి వెంటే తీసుకెళుతుండటంతో చదువుకు దూరం కావాల్సి వస్తోంది’.. అంటూ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఉమా, జరీనా, గీతాంజలి, రాజేశ్వరి, భావన తదితరులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్ప యాత్ర గంజిహళ్లిలో కొనసాగుతుండగా వారు జగన్‌ను కలిసి తమ ఊరిలోనే హాస్టల్‌ ఏర్పాటు చేయించాలని, లేదంటే తమ తల్లిదండ్రులకు ఇక్కడే ఏదైనా పనికల్పించాలని కోరారు.   

Advertisement
Advertisement