మీరు బాగుండాలి.. మేం నాశనం కావాలా? | Sakshi
Sakshi News home page

మీరు బాగుండాలి.. మేం నాశనం కావాలా?

Published Fri, Mar 23 2018 3:59 PM

Somireddy Fire On BJP And NDA Government - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేసుకుంటారని భావించాం కానీ కుట్రలు పన్నుతారనుకోలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ ఏడు రాష్ట్రాలు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా 2015లోనే చెప్పారని, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి మిత్ర ధర్మ తెలుసునని, అందుకు గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ కూటముల్లో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఎక్కడా గీత దాటలేదన్నారు. కేంద్రంలో మీరు మాత్రం బాగుండాలి కానీ రాష్ట్రంలో మాత్రం మేం నాశనం కావాలా అంటూ మండిపడ్డారు.

'రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించాం. తెలంగాణలో టీడీపీతో బీజేపీ తామంతట తామే తెగతెంపులు చేసుకున్నా.. మేం నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభులను రాజ్యసభకు పంపిన విషయాన్ని ఆ పార్టీ
గుర్తుంచుకోవాలి. ఏపీ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాం. ఢిల్లీ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఏమంత కరుణ చూపలేదు. ఏ కేసుల కోసం మేం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదు. అవిశ్వాసం అంటూ నోటీసు
ఇచ్చిన వారిని ఆంతరంగిక గదుల్లో పెట్టుకుంటారా. ఈశాన్య రాష్ట్రాలకు తాజాగా రూ.3 వేల కోట్ల ప్రయోజనాలు కల్పించి ఆంధ్రప్రదేశ్‌ని ఎందుకు విస్మరించారంటూ' సోమిరెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ కి హోదా తెచ్చే విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హీరో అని ప్రధాని నరేంద్ర మోదీనే అభివర్ణించారని గుర్తు చేశారు. అలాంటి వెంకయ్యను ప్రస్తుతం కీలక పాత్ర పోషించలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ నాలుగేళ్లు మేం మిత్ర ధర్మాన్ని పాటిస్తే మీరు అధర్మాన్ని పాటించారని బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్‌షాలు మిత్రధర్మం విలువలు కాల రాశారని, దేశంలో మరే ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement