వాళ్ల ఓట్లు కూడా మనమే వేయాలి! | Sakshi
Sakshi News home page

వాళ్ల ఓట్లు కూడా మనమే వేయాలి!

Published Wed, Apr 3 2019 5:15 PM

SP leader asks party workers to vote on behalf of people who don’t plan to - Sakshi

ఛతార్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌): దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రోజుకురోజుకు పెరుగుతోంది. జనాన్ని ఆకట్టుకొని.. తమ పార్టీలకు ఓట్లు రాబట్టేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు అనేక రకాల హామీలిస్తుంటే.. మరికొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి వివాదాస్పదం అవుతున్నారు.  ఇదే క్రమంలో ఓ పార్టీ నాయకుడు జనం ఓట్లు వేయకుంటే.. వారి తరఫున మీరే ఓట్లు వేయండంటూ కార్యకర్తలకు సూచనలిచ్చాడు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. 

మధ్యప్రదేశ్‌ ఛతార్‌పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆర్‌ ఆర్‌ బన్సాల్‌ ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఊరికి మన పార్టీ కార్యకర్తలు వెళ్లాలి. అక్కడ ఓటర్ల వివరాలు తెలుసుకోవాలి. ఓటర్లు ఎవరైనా ఓటు వేయకుంటే.. వారి తరఫున మనమే ఓటు వేయాలి’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కేఎస్‌ ఈశ్వరప్ప కూడా ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింలు తమ పార్టీకి ఓటు వేయరని, అందుకే వారికి టికెట్లు ఇవ్వడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.

Advertisement
Advertisement