కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు | Sakshi
Sakshi News home page

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

Published Wed, Jul 17 2019 11:01 AM

Supreme Court Verdict on Karnataka Crisis - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు: గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం​ చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్‌ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని వెల్లడించింది.

తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ రమేశ్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. రెబెల్స్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ , సీఎం కుమార స్వామి తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ రాజీవ్‌ ధావన్, స్పీకర్‌ తరఫున ఏఎం సింఘ్వి వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది.

Advertisement
Advertisement