‘కొట్లాట’కు అనుమతిచ్చి అరెస్టులా? | Sakshi
Sakshi News home page

‘కొట్లాట’కు అనుమతిచ్చి అరెస్టులా?

Published Tue, Dec 5 2017 2:57 AM

tammineni veerabadram commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ పోకడలు పోతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. హైకోర్టు జోక్యంతో కొలువుల కొట్లాట సభకు అనుమతిచ్చి విద్యార్థులు, యువకులు సభకు వెళ్లకుండా రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేసిందని, నాయకులను నిర్బంధించిందని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అడగడాన్ని కూడా సహించడంలేదని, అణచివేతను విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెట్టని కోటగా ఉన్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బతకనిస్తుందా అనే భయాందోళనలు ప్రజల్లో బలపడుతున్నా యన్నారు. ఈ మేరకు సోమవారం ఇక్కడ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని, మెస్‌ బిల్లులు మొదలు, అన్నింటిలో వివక్ష చూపుతోందని తమ్మినేని ఆరోపించారు.

ఖమ్మంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సభలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యను అరెస్టు చేశారని, సామాజిక తరగతుల ప్రజలకు మద్దతుగా ఆయన ఉద్యమాల్లో భాగస్వామి కావడం ప్రభుత్వానికి కంటగింపుగా ఉందని అభిప్రాయపడ్డారు. నిజాం నిరంకుశత్వాన్ని గుర్తుచేసేలా ముఖ్యమంత్రి వ్యవహరశైలి ఉందని, ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భక్షించే నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement