ప్రజాశక్తితోనే మతోన్మాదుల ఆటకట్టిస్తాం | Sakshi
Sakshi News home page

ప్రజాశక్తితోనే మతోన్మాదుల ఆటకట్టిస్తాం

Published Tue, Oct 10 2017 2:37 AM

tammineni veerabhadram on bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కమ్యూనిస్టులపై దాడి చేయటమంటే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. దేశంలో రాజ్యాంగ విలువల రక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, మత సామరస్యం, లౌకికత్వం కోసం నిలబడినది, మున్ముందు నిలబడేది ఎర్రజెండాలేనని అన్నారు. బీజేపీలాగా తమకు అంగబలం, అర్థబలం లేకపోయినా ప్రజాశక్తే తమకు కొండంత అండని, ఆ శక్తితోనే మతోన్మాదుల ఆటలు కట్టిస్తామని హెచ్చరించారు.

సీపీఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ దాడులను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ వద్ద సభ నిర్వహించారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ సభకు సీపీఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. తమ్మినేనితోపాటు సీపీఐ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సయ్యద్‌ అజీజ్‌పాషా సభకు హాజరై సంఘీభావం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, బి.వెంకట్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో కుల, మత కొట్లాటల ద్వారా లబ్ధి పొందడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని, సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెస్తూ వారిని చైతన్య పరుస్తున్న తమ పార్టీపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విష ప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు.

కేరళ ప్రభుత్వంపైన, సీపీఎంపైనా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నాయని ఆరోపించారు. కేరళలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ వాస్తవాలను వక్రీకరిస్తోందన్నారు. 2000 సంవత్సరం నుంచి 2017 వరకు 85 మంది సీపీఎం కార్యకర్తలు ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో హత్యకు గురయ్యారని తెలిపారు. కేరళలో ప్రస్తుత ఎల్డీఎఫ్‌ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 13 మంది సీపీఎం కార్యకర్తలను ఆర్‌ఎస్‌ఎస్‌ పొట్టనబెట్టుకుందని దుయ్యబట్టారు. తమ పార్టీ, ప్రజా సంఘాలకు చెందిన 65 కార్యాలయాలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులకు తెగబడ్డాయని మండిపడ్డారు.  

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌లో సీపీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఎంబీ భవన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చర్యలను నిరసిస్తూ నారాయణగూడ వరకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామన్న సీపీఎం నేతలను సైతం పోలీసులు ముందుకు కదలనీయలేదు. ఎంబీ భవన్‌ వద్ద సభ అనంతరం తమ్మినేని, అజీజ్‌పాషాతోపాటు సీపీఎం, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రదర్శన చేపట్టేందుకు బయలుదేరారు. వీరిని అక్కడే అడ్డుకున్న పోలీసులు అందర్నీ అరెస్టు చేశారు.   

Advertisement
Advertisement