తెలుగు తమ్ముళ్ల బరితెగింపు | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు

Published Mon, Oct 1 2018 12:10 PM

TDP Activist Attack On YSR Congress Party Leader - Sakshi

ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లుబరితెగించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి అన్న చేరాడన్న అక్కసుతో సొంత పార్టీ టీడీపీ కార్యకర్తపైనే దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వారు నడుపుతున్న స్టోర్‌ను లాగేసుకోవాలని పావులుకదుపుతున్నారు. శెట్టూరు మండలం చిన్నంపల్లిలో ఈ ఘటన జరిగింది.

అనంతపురం, (కళ్యాణదుర్గం రూరల్‌) శెట్టూరు: చిన్నంపల్లిలో రెండు ప్రభుత్వ చౌక ధాన్యపు డిపోలు (రేషన్‌షాపులు) ఉన్నాయి. రేషన్‌షాపు నంబర్‌ 27ను మాజీ ఎంపీటీసీ వెంకటేశులు భార్య సుశీలమ్మ నిర్వహిస్తోంది. రెండవదైన ఐదో నంబర్‌ రేషన్‌షాపును లక్ష్మీదేవి పేరు మీద ఉన్నా గ్రామస్తులు చర్చించుకుని కాంతమ్మ అనే మహిళ నిర్వహించేలా తీర్మానించి నడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా సెప్టెంబర్‌ ఆరో తేదీన కాంతమ్మ బంధువు అయిన కమ్మ ములకన్న టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. దీనిని జీర్ణించుకోలేని మాజీ ఎంపీటీసీ వెంకటేశులు ఐదో నంబర్‌ రేషన్‌ దుకాణం నిర్వహణ బాధ్యతల నుంచి కాంతమ్మను తప్పించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, తనయుడు మారుతీచౌదరి, శెట్టూరు ఎంపీపీ తిమ్మక్క భర్త చిత్తప్పలతో చర్చించాడు.  

స్టోరు నిర్వహించరాదంటూ హుకుం
ఈ క్రమంలో శనివారం సాయంత్రం కాంతమ్మ మరిది నాగేంద్రకు వెంకటేశులు ఫోన్‌ చేసి ‘స్టోరు నిర్వహించకూడదం’టూ హుకుం జారీ చేశాడు. ‘మీ అన్న వైఎస్సార్‌సీపీలోకి పోయాడు.. మీరెలా స్టోరు నిర్వహిస్తారు? మాకు మీరు అవసరం లేదంటూ’ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో మాటామాటా పెంచుకున్న ఇద్దరూ సాయంత్రం ఒకరినొకరు దూర్భాషలాడుకున్నారు. అనంతరం మాజీ ఎంపీటీసీ వెంకటేశులు, భార్య సుశీలమ్మ, బంధువులు శ్రీనివాసులు, గౌతమి, లక్ష్మీదేవిలు నాగేంద్రపై మూకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న శెట్టూరు పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల వారికీ సర్దిచెప్పి పంపించేశారు.  

ఆస్పత్రి వద్ద హల్‌చల్‌
దాడిలో తలకు బలమైన గాయాలైన నాగేంద్ర చికిత్స నిమిత్తం శనివారం రాత్రి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అయితే మాజీ ఎంపీటీసీ అప్పటికే స్థానికులను పోగేసుకుని ద్విచక్రవాహనాల్లో ఆస్పత్రికి చేరుకుని హల్‌చేశాడు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. చికిత్స కోసం వచ్చిన నాగేంద్రను, ఆయన వెంట వచ్చిన ములకన్నలను ఆదివారం ఉదయం ఆస్పత్రికి రండంటూ చెప్పి ఇంటికి పంపించేశారు.  

ఫిర్యాదు నమోదులో తాత్సారం
ఆదివారం ఉదయం మాజీ ఎంపీటీసీ తల్లి లక్ష్మీదేవి, మరదలు గౌతమి, కుమార్తె సౌందర్యలను శెట్టూరు ఎంపీపీ భర్త చిత్తప్ప తన కారులో చికిత్స కోసం కళ్యాణదుర్గం ఆస్పత్రికి స్వయంగా తీసుకువచ్చాడు. దాడిలో గాయపడినట్లు ఔట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు నాగేంద్ర మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్నాడు. అయితే ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఒత్తిళ్లు రావడంతో నాగేంద్ర నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు తాత్సారం చేశారు. చివరకు శెట్టూరు పోలీసులు ఇరువర్గాల వారిపైనా కేసు నమోదు చేశారు.  

బాధితుడికి పరామర్శ
చిన్నంపల్లిలో జరిగిన దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ములకన్న సోదరుడు నాగేంద్రను వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం పరామర్శించారు. మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదాఖలందర్, నాయకులు బసిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, యువజన నాయకులు దొడగట్ట సూరి, ఇబ్రహీం, సురేష్, మోహన్‌లు పరామర్శించి, ధైర్యం చెప్పారు. 

Advertisement
Advertisement