టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్న టీడీపీ మాజీలు! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు దగ్గరవుతున్న టీడీపీ మాజీలు!

Published Mon, Jan 8 2018 3:14 AM

TDP Ex leaders approaching TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ నేతలను చేర్చుకోవడంలో అధికార టీఆర్‌ఎస్‌ బిజీగా ఉంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాల వల్ల కొందరు నేతలు క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నారు. టీటీడీపీ రాజకీయమంతా కేవలం ఇద్దరు ముగ్గురు నేతల చుట్టూ తిరుగుతుండటం, పార్టీ అధినేత చంద్రబాబు ఇక్కడి వ్యవహారాలను అంతగా పట్టించుకోకపోవడం, రానున్న ఎన్నికల్లో నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేమన్న అభిప్రాయం బలపడటంతో పలువురు సీనియర్లు బయటకు వచ్చే ప్రయత్నాలు షురూ చేశారని చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ టీడీపీ నేతల సాయంతో తమ చేరికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

వాస్తవానికి రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్‌ గూటికి చేరే టీడీపీ నేతల సంఖ్య పెరిగింది. నియోజకవర్గ స్థాయి నేతలు టీఆర్‌ఎస్‌కు వరుసకట్టారు. అదే కోవలో మరికొందరి చేరికలకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. కొన్ని సామాజిక వర్గాల ఓట్ల కోసం ఆయా వర్గాల నేతలపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ సంబంధిత నేతల రికార్డు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటోందని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి చేరిక జరిగిందని ఉదహరిస్తున్నారు.  

క్యూలో మాజీ మంత్రి మండవ?
పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. ఆయనను టీఆర్‌ఎస్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఒక మంత్రి తీసుకున్నారని, చేరిక ముహూర్తమే ఖరారు కావాల్సి ఉందంటున్నారు. మండవ చేరిక ద్వారా పాత నిజామాబాద్‌ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి లాభిస్తుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం కేటాయించాలా? లేక ఇతరత్రా అవకాశం కల్పించాలా అన్న విషయంపైనే చర్చ జరుగుతోందని సమాచారం. మండవ గతంలో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంగా ఆవిర్భవించింది.

చాన్నాళ్లుగా టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు సుముఖంగా లేరన్న ప్రచారం కూడా ఉంది. అదే సందర్భంలో నిజామాబాద్‌ జిల్లాలోనే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. గతంలో ఆర్మూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలేటి అన్నపూర్ణమ్మ కూడా టీడీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకత్వంతో చర్చలు కూడా జరిపారని సమాచారం. ఆమె బాల్కొండ నియోజకవర్గంలో అవకాశం కావాలని కోరారని, టీఆర్‌ఎస్‌ నాయకత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో చేరిక ఆలస్యమవుతోందని చెబుతున్నారు. వరంగల్‌తో పాటు దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూడా కొందరు టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని సమాచారం. 

Advertisement
Advertisement