నీటి మీద రాతలు..  టీడీపీ హామీలు | Sakshi
Sakshi News home page

నీటి మీద రాతలు..  టీడీపీ హామీలు

Published Sun, Jun 24 2018 4:46 AM

TDP Govt not even stands on any Guarantees as per there Manifesto - Sakshi

సాక్షి, అమరావతి: ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో బైబిల్‌ లాంటిది. తాము అధికారంలోకి వస్తే ఏ పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెడతామో తెలిపే ప్రణాళిక అది. దాన్ని చూసి ఆ పార్టీ విధానాలు, హామీలను బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లేస్తారు. అలాంటి మేనిఫెస్టోను అమలు చేయడానికి ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ తాను రూపొందించిన మేనిఫెస్టోకే తూట్లు పొడిచింది. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఏ ఒక్కదాన్నీ సరిగా అమలు చేయలేకపోయింది. మేనిఫెస్టోలంటేనే ప్రజలకు నమ్మకం పోయేలా వారిని నిట్టనిలువునా ముంచింది.  

ఏదీ స్వర్ణాంధ్ర! 
స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగంగా కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని, ఇంటికో ఉద్యోగం సృష్టిస్తామని చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. కొత్త ఆర్థిక వ్యవస్థ ఏమోగానీ ఉన్న ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేసింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి రాజధాని ప్రయోజనాలన్నింటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేసింది. నాలుగేళ్లుగా గ్రాఫిక్స్‌ చిత్రాలతో హడావుడే తప్ప ఒక్క పూర్తిస్థాయి నిర్మాణాన్నీ ఇప్పటివరకూ చేపట్టలేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించి అందుకు కోట్ల రూపాయలను దుబారా చేసింది. రాజధాని కోసమంటూ కృష్ణానదీ తీరంలో మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరించింది. అక్కడ రాజధాని వస్తుందని అస్మదీయులకు ముందే లీకులిచ్చి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది.  

 నట్టేట వ్యవసాయం, సాగునీటి రంగాలు 
వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఇంటర్నేషనల్‌ అగ్రి సొల్యూషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు, వేరుశనగ పంటకు ప్రత్యేక డైరెక్టరేట్, డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫారసుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు, రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.5 వేల కోట్లతో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు వంటి ఎన్నో హామీలిచ్చినా అవేమీ అమలుకు నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటలనే ఇప్పటికీ చెబుతుండడాన్ని బట్టి ప్రభుత్వం ఏమీ చేయలేదనే విషయం తేటతెల్లమవుతోంది.   

 కానరాని మహిళా సాధికారత 
మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ప్రతి పల్లెలో, వాడలో బెల్టు షాపులు రాజ్యమేలుతున్నాయి. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని నమ్మించి పీఠమెక్కాక వారికి కేవలం రూ.పది వేల మూల నిధిని మాత్రమే విడతల వారీగా ఇచ్చింది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.30 వేలు డిపాజిట్‌ చేసే మహాలక్ష్మి పథకం, పేద మహిళలకు స్మార్ట్‌ సెల్‌ఫోన్లు, బాలికా పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల నియామకం, అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థినులకు హాస్టల్‌ వసతి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘కుటీర లక్ష్మి’ పథకం వంటివన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి.  

ఇంటికో ఉద్యోగం ఎక్కడ?  
ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి వారి ఆశలను నీరుగార్చారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారు. ప్రతి కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, ప్రతి జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేందుకు ఎన్టీఆర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు హామీలు అబద్ధాలుగానే మిగిలిపోయాయి. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఏటా రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ ప్రకటించి నియామకాలు జరుపుతామని చెప్పి అరకొర నోటిఫికేషన్లతో సరిపెట్టారు. ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాని గురించే పట్టించుకోలేదు. చివరికి నిరుద్యోగుల నుంచి తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఏర్పడడంతో కేవలం పది లక్షల మందికి రూ.1000 భృతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. 

జిల్లాకో పోర్టు ఎక్కడ? 
ప్రతి జిల్లాకు ఒక పోర్టు, పోర్టులను అనుసంధానిస్తూ కలకత్తా–చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా మరో రహదారి నిర్మాణం, అన్ని జిల్లా కేంద్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మెగా ఫుడ్‌ పార్క్‌లు, పత్తి పండించే ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, కడప–కర్నూలు–అనంతపురం జిల్లాల్లో సిమెంట్, స్టీల్‌ పరిశ్రమలు అభివృద్ధి, ఆటో మొబైల్‌ హబ్‌గా కృష్ణా, ఆక్వా కల్చర్‌ హబ్‌గా పశ్చిమగోదావరి, మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌లుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలన్నీ నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు, వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్‌ రైళ్లు వంటి హామీలిచ్చినా ఒక్కదాన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. 

అన్ని కులాలకు మిగిలింది వంచనే.. 
ఎస్సీలకు వార్షికాదాయ పరిమితి లేకుండా స్కాలర్‌షిప్, ప్రత్యేక కార్పొరేషన్, ఆరు నెలల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, పరిశ్రమల స్థాపనకు రూ.5 కోట్ల వరకూ వడ్డీ లేని రాయితీ ఇస్తామని చెప్పిన మాటలన్నీ బుట్టదాఖలయ్యాయి. జిల్లా యూనిట్‌గా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఎస్‌టీలకు రిజర్వేషన్ల అమలు, 50 ఏళ్లున్న గిరిజనులకు రూ.వెయ్యి పింఛను, ఇల్లు లేని గిరిజనులకు 1.50 లక్షలతో ఇల్లు, భూమిలేని ప్రతి గిరిజన కుటుంబానికి రెండెకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామన్న హామీలు అమలు కాలేదు. ముస్లింలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు, ముస్లిం విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీల ఏర్పాటు, ఉర్దూ టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ, ఆదాయం లేని మసీదుల్లో ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలిస్తామని నమ్మించి వంచించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దానికి తగినన్ని నిధులు ఇవ్వలేదు. పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్లు, దేవాలయ పూజారులకు పదవీ విరమణ ఉండదని హామీలిచ్చి అమలు చేయలేదు. ఇచ్చిన హామీకి విరుద్ధంగా టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించారు. 

సంక్షేమానికి సంకెళ్లు..  
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లెక్కలేనన్ని హామీలిచ్చినా అవేమీ అమలుకాలేదు. బీసీలకు వంద సీట్లు ఇస్తామని చెప్పి ఎన్నికల్లోనే వారిని దగా చేసింది. నామినేడెడ్‌ పోస్టుల్లో బీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి అనేక హామీలు గాలిలో కలిసిపోయాయి. చేతి వృత్తుల వారికి విద్యుత్‌లో రాయితీ అమలు కాలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి, ఏటా రూ.1000 కోట్ల బడ్జెట్, జిల్లాకు ఒక చేనేత పార్కు, చేనేతలకు ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు, చేనేతల పిల్లల చదువుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం హామీలు అమలు కాలేదు. గీత కార్మికుల చెట్టు పన్ను ప్రభుత్వమే చెల్లించడం, ఎక్సైజ్‌ శాఖ పరిధి నుంచి కల్లు వృత్తిని తప్పిస్తామని చెప్పిన మాటలు అలాగే మిగిలిపోయాయి. మత్స్యకారులకు సముద్ర ప్రాంతాల్లోని భూముల కేటాయింపు, పంచాయతీరాజ్, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులను మత్స్యకార సొసైటీలకు అప్పగించే విషయాన్ని పట్టించుకోలేదు. గొర్రెల కాపరులు, నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి నాలుగేళ్లలో నామమాత్రంగానైనా ఇళ్లు నిర్మించిన పాపానపోలేదు. అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణం కోసం ప్రత్యేక పథకం, శాటిలైట్‌ నగరాల నిర్మాణం, తక్కువ ధరల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం, అనుకూల స్థలాల్లో కాలనీల ఏర్పాటు వంటివన్నీ మాటలుగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ క్యాన్‌ సరఫరా హామీ నాలుగేళ్లయినా అమలు కాలేదు.  

మేనిఫెస్టో అమలులో విఫలం  
టీడీపీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు అన్నీ చేసేస్తామని చెప్పి నాలుగేళ్లుగా ప్రచారంతో పబ్బం గడుపుకున్నారు. ప్రధానంగా ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారు. రైతులకు సంబంధించి చేస్తామని చెప్పిన అంశాల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. ధరల స్థిరీకరణ చేస్తామని, దానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది? రాజధాని నిర్మాణం కూడా చేయలేదు. రైతు రుణమాఫీ కూడా సరిగా అమలు చేయలేకపోయారు.  
–కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  

ఏ హామీనీ అమలు చేయలేదు 
టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దేన్నీ అమలు చేయలేదు. అధికారంలోకి రావడం కోసం లెక్కలేనన్ని హామీలు గుప్పించి వచ్చాక పక్కనపెట్టేశారు. టీడీపీ వెబ్‌సైట్‌లోనే పార్టీ మేనిఫెస్టోను తొలగించారు. ఎందుకు తొలగించారు? దీన్నిబట్టే అందులో చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. రంగాల వారీగా, కులాల వారీగా హామీలిచ్చి ఎవరికీ న్యాయం చేయలేదు.  
–ఎన్‌.రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు 

విద్య, వైద్యం మిథ్యే 
నివాస ప్రాంతాల్లో ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటుచేస్తామని చెప్పి ఆ పని చేయకపోగా ఉన్న పాఠశాలలనే మూసివేసింది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఒకే ఒకసారి డీఎస్సీ నిర్వహించి చేతులు దులుపుకుంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి దాన్ని నీరుగార్చింది. మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని వ్యాధులను చేరుస్తామని చెప్పి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జాతీయ రహదారుల పక్కన అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు, జిల్లా కేంద్రాల్లో నిమ్స్‌ స్థాయిగల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు కూడా సాకారం కాలేదు. 

Advertisement
Advertisement