Sakshi News home page

తమ్ముళ్ల తిరుగుబాటుతో కంగుతిన్న బాబు 

Published Sat, Aug 25 2018 3:58 AM

TDP Leaders angry over Chandrababu about Alliance with Congress - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌తో పొత్తుపై తమ పార్టీ సీనియర్ల ప్రకటనలతో  తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కంగుతిన్నారు. సీనియర్‌ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఊహించని ఎదురుదాడితో కుదేలైన చంద్రబాబు నష్టనివారణ చర్యల్లో భాగంగా శనివారం రాత్రి తన అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారని, రాజకీయ పొత్తుల అంశాన్ని పొలిట్‌బ్యూరోలో చర్చించకుండానే పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? ఆ మాత్రం సీనియర్‌ నాయకులకు తెలియదా? అని కోపం ప్రదర్శించినట్లు ‘పచ్చ’ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.

కాంగ్రెస్‌తో పొత్తు లీకులు వచ్చినప్పటి నుంచే పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు సభావేదికపైనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చనువుగా మెలిగిన తీరు, తాజాగా హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నప్పటి నుంచే పార్టీలో అంతర్గత చర్చలు జోరుగానే సాగుతున్నాయని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు, ఎన్‌టీఆర్‌ను అభిమానించే శ్రేణులు చంద్రబాబు చర్యలను జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన తెలిపారు. పార్టీలో అన్ని స్థాయిల్లోని వ్యతిరేకతను గుర్తించినందునే కేఈ, అయ్యన్న.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలిపారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా దశాబ్దాల అనుభవమున్న వారే బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటే క్షేత్రస్థాయిలోని క్యాడర్‌ ఇంకెంతగా రగిలిపోతున్నారో తెలియందికాదు అంటూ ఆయన విశ్లేషించారు. 

నిఘా వర్గాల హెచ్చరికలతో...  
రాహుల్‌ను బ్రాహ్మణి కలసినప్పటి నుంచే చంద్రబాబు ఉద్దేశంపై పార్టీ నాయకులు, శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో ఆరో పెళ్లికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడంతో టీడీపీ శ్రేణులకు ఆ విషయం మరింత రూఢీ అయ్యింది. దీనిపై పార్టీ గానీ, సీనియర్లు గానీ పెదవి విప్పకపోవడంతో కాంగ్రెస్‌తో కలసి పయనించక తప్పని పరిస్థితులు రానున్నాయని గుర్తించిన సీనియర్లు, కార్యకర్తలు భగ్గుమంటున్నారని నిఘా వర్గాలు చంద్రబాబుకు తాజాగా నివేదించాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని మళ్లీ అదే పార్టీతో కలపడాన్ని నాయకులు, క్యాడర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని వివరించాయి. ఈ పరిస్థితులకు తోడు కేఈ, అయ్యన్నల వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యిందని చెప్పాయి. దీంతో ఇంకెవరినీ మాట్లాడకుండా చేయడానికే కేఈ, అయ్యన్నలపై బాబు సీరియస్‌ అయ్యారనే వార్తలను అనుకూల మీడియా ద్వారా ప్రసారం చేయిస్తున్నారని విమర్శలు వచ్చాయి.   

పొలిట్‌బ్యూరోకు అన్నీ చెప్పే చేస్తున్నారా?  
పొత్తులపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంటారని సీనియర్‌ మంత్రులకు తెలియకపోతే ఎలా అని సీఎం ప్రశ్నించారనే వార్తలపై టీడీపీ శ్రేణులే భగ్గుమంటున్నాయి. అసలు ఈ నాలుగున్నరేళ్లలో పొలిట్‌బ్యూరో కూర్చుని చర్చించిన ప్రధానాంశాలు ఏమి ఉన్నాయని కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ కార్యక్రమానికి బ్రాహ్మణి వెళ్లడం గురించి కనీసం పార్టీలోని కొందరు ముఖ్యులకైనా తెలిసిందా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను కోట్లు కుమ్మరించి కొనుగోలు చేయడంపై పొలిట్‌బ్యూరోలో చర్చించారా? వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం గురించి ముఖ్యులతో మాట్లాడారా? రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక గురించి సంప్రదించారా? అసలు పార్టీ, ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏవైనా సరే పొలిట్‌బ్యూరో ముందుకు తీసుకొస్తున్నారా? అని సీనియర్ల అంతర్గత చర్చల్లో ప్రస్తావనకు వస్తున్నాయని గుంటూరు జిల్లాకు చెందిన మరోనేత ప్రశ్నించారు.   

Advertisement
Advertisement