టీడీపీ తోడు నిఘా జోడు | Sakshi
Sakshi News home page

టీడీపీ తోడు నిఘా జోడు

Published Thu, Mar 28 2019 12:04 PM

TDP Leaders Land Mafia In Chittoor - Sakshi

నిఘా వ్యవస్థలో కీలక భూమిక పోషించే ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారుల్లో కొందరు అధికార పార్టీ నాయకుల్లా పనిచేస్తున్నారు. భద్రతను పక్కనపెట్టారు. కేవలం టీడీపీ కోసమే తాము ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, వారి అనుచరుల కదలికలపై నిత్యం నిఘా పెట్టారు. వారు ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసి మాట్లాడినా ఆ వివరాలను ఆఘమేఘాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా కుప్పం, చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి, పలమనేరుతో పాటు పలు నియోజక వర్గాల్లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు సీఎం పీఏ మనోహర్‌ కనుసన్నల్లో నడుచుకుంటున్నారు. మనోహర్, స్పెషల్‌ బ్రాంచ్‌ ముఖ్య అధికారి రాంకుమార్‌  ఆదేశించిన రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. ఐదేళ్ల పాలనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. దిక్కుతోచని టీడీపీ అధినేత ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులను ఆశ్రయించారు. సొంత పార్టీ నేతలు, వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రధానంగా నిఘా పెట్టమని ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అధి కారులు వారి వాహనాలు, ముఖ్య అనుచరుల కదలికలపై దృష్టి సారించారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఎనిమిది మంది టీడీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

వాస్తవానికి 20 మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో చేరాల్సి ఉంది. ఎవరెవరు పార్టీలో చేరుతున్నారనే వివరాలను ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు తెలుసుకుని సీఎం పీఏ, టీడీపీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు కార్పొరేటర్లను నయాన, భయాన ఒప్పించే ప్రయత్నం చేశారు. పార్టీ మారితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిం చారు. దీంతో వారు వెనుకడుగు వేశారు. గతవారం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తున్నారని తెలుసుకున్న మేయర్‌ హేమలత, ఆమె భర్త కఠారి ప్రవీణ్‌ పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లిన నిఘా విభాగానికి చెందిన అధికారులు ‘పార్టీ వీడొద్దు.. వీడితే మీరు రోడ్లపై కూడా తిరగలేరు.

పాత కేసులు తిరగదోడుతాం’ అంటూ భయపెట్టారు. మేయర్‌ దంపతులు పార్టీ మారేందుకు సాహసించలేదు. టీడీపీ బీసీ నేత రావూరి ఈశ్వరరావు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ‘మళ్లీ మాట్లాడొద్దంటూ’ ఈశ్వరరావుకు హుకుం జారీ చేశారు. అంతటితో విడిచిపెట్టలేదు. ఆయనను చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో చెప్పి చుడా (చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చైర్మన్‌ ఇప్పిస్తామని ఈశ్వరరావును శాంతపరిచారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మరికొందరు టీడీపీ కార్యకర్తలను ఇంటెలిజెన్స్‌ అధికారులు బెదిరించి పార్టీ మారకుండా ఆపించారు.

కుప్పం.. చంద్రగిరిలో బహిరంగం
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం, సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికా రులు బహిరంగంగానే టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. రామకుప్పం మండలం విజిలాపురంలో ఇటీవల మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డుపడి రచ్చరచ్చ చేశారు. ఇంటెలిజెన్స్, పోలీసులు అక్కడే ఉన్నా వారించకపోగా వీడియో చిత్రీకరించారు. ఆపై వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసే విషయంలో కీలక పాత్ర పోషించారు.

నియోజకవర్గంలో విలువైన గ్రానైట్‌ అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా, క్వారీలో పేలుళ్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. శాంతిపురం మండ ల పరిధిలో ఓ గ్రామంలో రెండు కుటుం బాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో టీడీపీ నేతలు కల్పిం చుకుని ఓ మహిళను వివస్త్రను చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇంత దారుణం జరిగినా టీడీపీ నేతలకు మద్దతుగా నిలబడి బాధితులపైనే కేసులు బనాయించారు. కుప్పంలో వెంకటేష్‌బాబుపై టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యు డు రాజ్‌కుమార్‌ దాడిచేశారు. తిరుపతి గంగ మ్మ ఆలయం వద్ద కాంగ్రెస్‌ నాయకుడు సురేష్‌బాబుపై దాడిచేశారు. అయితే ఇంటెలిజెన్స్‌ అధికారులు అవేమీ పట్టించుకోలేదు.

కార్యకర్తలకు ప్రత్యేక విధులు
ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులకు తోడుగా ప్రతి గ్రామం, పట్టణాల్లో టీడీపీ కార్యకర్తలకు నెలనెలా కొంత మొత్తం ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. వారు ఇచ్చే సమాచారంతో పాటు ఈ రెండు విభాగాల్లో పనిచేసే అధికారుల వద్ద నుంచి తీసుకున్న వివరాలను ప్రతిరోజూ టీడీపీ అధినేత చంద్రబాబుకు చేరవేస్తుండడం గమనార్హం.

Advertisement
Advertisement