టీడీపీ నేతల అవినీతి బట్టబయలు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అవినీతి బట్టబయలు

Published Mon, Apr 30 2018 7:00 AM

TDP Leaders Mining Corruption Reveals In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: మట్టి, ఇసుక, రేషన్‌ బియ్యం, అక్రమ మైనింగ్‌ ఇలా దేన్ని వదలకుండా టీడీపీ నాయకులు అడ్డంగా దోచేస్తున్నారు.. అడుగడుగునా అవినీతి .. ఎక్కడ చూసినా అక్రమ దందా .. ఇవి జిల్లాలో అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలు.. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఆరోపణలు చేస్తే రాజకీయ లబ్ధి కోసం బురదజల్లుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమ దందాపై సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటంతో టీడీపీ అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో దోచేస్తున్నారో.. ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారో నిరూపిస్తామంటూ సొంతపార్టీ నేతలే విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ సవాల్‌ చేస్తున్న సంఘటనలు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జరుగుతూనే ఉన్నాయి. పార్టీలో నెలకొన్న విభేదాలతో అధికార పార్టీ నేతల బండారాలు బయటపడుతుండటంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్న ప్రత్తిపాడు, నిన్న నరసరావుపేట, నేడు తాడికొండ నియోజకవర్గాల్లో అక్కడి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలపైనే సొంత పార్టీ నేతలు బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, వారి అనుచరులు చేస్తున్న అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, క్రికెట్‌ బెట్టింగ్‌లు, స్థలాల కబ్జాలు, బార్లు, వైన్స్‌ల నుంచి డబ్బులు వసూలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్‌లు ఇలా అన్ని అంశాల్లోనూ అవినీతి తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ నేతల అక్రమ దందాపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రుజువులతో సహా బయటపెట్టినా కావాలనే తమపై బురద జల్లుతున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే తాజాగా జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాలను సొంత పార్టీ నేతలే బహిర్గతం చేస్తుండటంతో ప్రజలు టీడీపీ తీరును గమనిస్తున్నారు.

అవినీతిపై సవాళ్లకు సిద్ధం..
ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్‌ మండల పరిధిలో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల మట్టిని దోచేస్తున్నారంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మట్టి దోపిడీ వ్యవహారంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెప్పినా పట్టించుకోలేదని, ఆయన నేరుగా మట్టి క్వారీ వద్దకు వెళ్లి లారీలు నిలిపివేసిన ఘటన ఆ పార్టీలో విభేదాలు బట్టబయలు చేసింది. నరసరావుపేట నియోజకవర్గంలో కోడెల శివరామ్‌ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పులిమి వెంకట రామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ దీక్షకు దిగడం తీవ్ర సంచలనం రేపింది. అంతేకాకుండా ఈయన దీక్షకు కోడెల వ్యతిరేక వర్గం హాజరై మద్దతు కూడా తెలిపింది. ఇది చూసి కోడెల అనుకూల వర్గీయులు సైతం దీక్షలకు దిగడంతో నరసరావుపేటలో రాజకీయాలు వేడెక్కాయి.

అవినీతిని బయటపెట్టి దీక్ష చేసినందుకు తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ పులిమి వెంకటరామిరెడ్డి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొమ్మినేని రామచంద్రరావు వర్గీయులు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధికి అడ్డు పడుతున్నారని, గ్రామంలో నీరు – చెట్టుతో పాటు పలు కార్యక్రమాల్లో రూ.8 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అవినీతి నిరూపిస్తానంటూ ఆయన సవాల్‌ చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేస్తున్న అవినీతి దందాను సొంత పార్టీ నేతలే బహిర్గతం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వీరిలో కొందరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండగా, మరికొందరు మాత్రం వారి మధ్య ఉన్న విభేదాలపై బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీళ్లా మన నాయకులంటూ అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement