మాకొద్దీ ఎమ్మెల్సీ... | Sakshi
Sakshi News home page

మాకొద్దీ ఎమ్మెల్సీ...

Published Wed, Feb 27 2019 7:18 AM

TDP Leaders Rejects MLC Seat in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎవరైనా పదవి ఇస్తామంటే ఎగిరి గంతేస్తారు. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలోకి దిగేందుకు మాత్రం అధికార టీడీపీలో ఆశాజహులు ఆసక్తి చూపడం లేదు.  ఎవరో ఒకర్ని ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా పంపితే రానున్న ఎన్నికల్లో ఒత్తిడి తగ్గుతుందని భావనతో ఈ ఉపఎన్నికను తెరపైకి తీసుకొచ్చారు. కానీ అనూహ్యంగా పార్టీ ఆశావాహులంతా అసెంబ్లీ టికెట్‌ అయినా ఇవ్వండి లేదా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వండని కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మాత్రం వద్దంటున్నారు.

పదవీ కాలం రెండేళ్ల వల్లే..
పదవీ కాలం కేవలం రెండేళ్లే కావడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఊహించని రీతిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతోంది. నాలుగు నెలల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి దుర్మరణం పాలవడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. స్థానిక సంస్థల ఓటర్లయిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా మరో నాలుగు నెలల్లో ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు జరగవని అందరూ తేలిగ్గా తీసుకున్నారు. దీనివల్ల ఓటర్ల జాబితా జోలికి పోలేదు. అయితే ఈ స్థానానికి  ఉపఎన్నిక నిర్వహించడం ద్వారా ఆశావాహుల్లో ఒకరినైనా భర్తీ చేయడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి వచ్చే ఒత్తిడిని కాస్త తగ్గించుకోవచ్చునని టీడీపీ అధినాయకత్వం ఎత్తుగడ వేసింది.
ఈ కారణంగానే పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఈ స్థానానికి కూడా ఉపఎన్నిక  నిర్వహించాలని ప్రతిపాదించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు ఈ స్థానానికి కూడా ఉపఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

ఆశలు గల్లంతేనా?
అనూహ్యంగా తెరపైకి వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వల్ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బెర్త్‌ ఆశిస్తున్న వారి ఆశలు గల్లంతయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడితే ఆరేళ్లు పదవికి ఢోకా ఉండదని ఆశావాహులు ఆశ పడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీపదవీ కాలం కేవలం రెండేళ్లే కావడంతో ఈ ఉపఎన్నికలో బరి లోకి దిగేందుకు పార్టీ సీనియర్లు ఎవరూ ఆశించడం లేదు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బెర్త్‌ లేదా రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆశావాహు లంతా అమరావతిలోనే తిష్టవేసి తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. జెడ్పీచైర్‌పర్సన్‌ లాలం భవాని భర్త లాలం భాస్కర్, మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ రెహ్మాన్‌ వంటి నేతలు అధినేత దృష్టిలో పడేందుకు రాజధానిలో నానా తంటాలు పడుతున్నారు.

తెరపైకి భరత్‌..
విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు ఎం.వి భరత్‌ను ఎమ్మెల్సీగా పంపాలన్న ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తోంది. రెండేళ్లు మాత్రమే పదవీకాలం ఉండే ఎమ్మెల్సీగా తాను కోరుకోవడం లేదని, విశాఖ ఎంపీగానే బరిలోకి దిగాలని ఆశిస్తున్నట్టుగా తన మామ సినీ నటుడు బాలకృష్ణ ద్వారా భరత్‌ పార్టీ అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు టీడీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను ఎమ్మెల్సీగా పంపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఆయన కూడా అనకాపల్లి ఎంపీ లేదా యలమంచిలి స్థానాల నుంచి బరిలోకి దిగాలన్న తన మనసులోని మాటను బయటపెట్టినట్టుగా చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సీట్లు దక్కే చాన్స్‌లేదని నిర్ధారించుకున్న పలువురు మాత్రం ఏదో ఒక పదవి దక్కితే అదే పదివేలు అన్నట్టుగా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాము ఏమి కోరుకుంటున్నామో తమ అధినేతకు తెలియజేశాం..ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమేనని పార్టీ సీనియర్‌ నేతొకరు ‘సాక్షి’కి తెలిపారు. ఏది ఏమైనా సీల్డ్‌ కవర్‌లోనే అభ్యర్థి పేరు వస్తుందంటున్నారు.

పట్టువదలని విక్రమార్కుల్లా..
విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు సోమవారం అమరావతిలో పార్టీ అధినేత చంద్ర బాబును కలిసి తన కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరారు.జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలం భవాని భర్త భాస్కర్‌ కూడా చంద్రబాబును కలిసి యలమంచిలి లేదా మాడుగుల ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, లేదంటే ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక మాజీ మంత్రి మణికుమారి, రెహ్మాన్‌లు కూడా పట్టువదలని విక్రమార్కుల్లో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.

Advertisement
Advertisement