టీడీపీ-బీజేపీ ఫైట్‌; తెరపైకి గోద్రా అల్లర్లు | Sakshi
Sakshi News home page

టీడీపీ-బీజేపీ ఫైట్‌; తెరపైకి గోద్రా అల్లర్లు

Published Sun, Mar 25 2018 2:50 PM

TDP MLA Gorantla Slams BJP Remembering Godhra Riots - Sakshi

సాక్షి, రాజమండ్రి: నాలుగేళ్లు ఉమ్మడిగా అధికారాన్ని పంచుకున్న టీడీపీ-బీజేపీలు ఇప్పుడు బద్ధశత్రువుల్లా కలహించుకుంటున్నవేళ గోద్రా అల్లర్ల వ్యవహారం మళ్లీ చర్చకు వచ్చింది. 2002నాటి గోద్రా అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న (అప్పటి గుజరాత్‌ సీఎం) నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వబోనని చంద్రబాబు శపథం చేయడం తెలిసిందే. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇరువురు నేతలూ కలిసిపోయి, కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కానీ, నాటి బాబు వ్యాఖ్యలను మోదీ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, ఆ కక్షతోనే ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ గోద్రా అల్లర్లను ప్రస్తావించారు. ‘‘గోద్రాలో మైనారిటీల ఊచకోతను చంద్రబాబు ఖండించారు. అప్పటి నుంచే బాబుపై మోదీ కక్ష పెంచుకున్నారు’’ అని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలో చేరి టీడీపీ నష్టపోయిందని, కేంద్రంలో టీడీపీకి పనికిమాలిన శాఖలు దక్కితే, ఏపీలో మాత్రం బీజేపీకి ముఖ్యమైన శాఖలు ఇచ్చామని అన్నారు.

వీర్రాజుకు కౌంటర్‌: టీడీపీపై ఎడతెగని విమర్శలు చేస్తోన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైనా గోరంట్ల ఫైరయ్యారు. ‘‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వీర్రాజు.. ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజమండ్రి రూరల్‌లో నాపై పోటీకి రావాలి. రాజమండ్రిలో అమిత్ షా సభ పెడితే వ్యాపారులను బ్లాక్ మెయిల్‌ చేసి డబ్బులు గుంజిన ఘనత వీర్రాజుది’’ అని మండిపడ్డారు.

Advertisement
Advertisement