పోలింగ్ సరళి : అభ్యర్థుల గుండెల్లో దడ | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 7 2018 2:33 PM

Telangana Election Polling Trends - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న ఎన్నికల పోలింగ్ సరళి ఆయా పార్టీలు, అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు రెండు నెలలకుపైగా ప్రచార ప్రక్రియ సాగినప్పటికీ శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా ప్రారంభం కావడం, మధ్యాహ్నం 12 గంటల వరకు ఆశించిన స్థాయిల్లో పోలింగ్ శాతం నమోదు కాకపోవడం అభ్యర్థుల్లో ఆందోళన పెంచింది. ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 10.15 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. భూపాలపల్లి, గద్వాల, సిర్పూరు, బెల్లంపల్లి, నిర్మల్, జుక్కల్, వేములవాడ, భువనగిరి, ములుగు తదితర నియోజకవర్గాల్లో ఉదయం పోలింగ్ కొంత మెరుగ్గా సాగింది. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఉదయం 9 గంటలకు సగటున దాటి 11 నుంచి 15 శాతం వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత నుంచి పోలింగ్ శాతం పుంజుకుంటుందని అంతా ఊహించినప్పటికీ అంత స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడం పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఉదయం 11 గంటలకు సగటు పోలింగ్ 23.4 శాతం నమోదైంది. 12 గంటలకు 35 శాతం వరకు పోలింగ్ జరగ్గా, మధ్యాహ్నం 1 గంట వరకు 47.8 శాతంగా ఉంది.

ఆ సమయంలో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు గురైనట్టు సమాచారం అందింది. పోలింగ్ తక్కువగా నమోదవుతోందని, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆయా పార్టీల నాయకత్వాల్లో కూడా ఆందోళన, చర్చ మొదలైనట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి నేతలు జిల్లాలకు ఫోన్లు చేసి వాకబు చేస్తుండగా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఆయా గ్రామాలు, మండలాల నేతలకు ఫోన్లు చేసి పరిస్థితిని కనుక్కోవడం ప్రారంభించారు. ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని పురమాయించడం మొదలుపెట్టారు. ఓట్లు ఎక్కడైతే కచ్చితంగా పార్టీకి పడతాయని అంచనా వేశారో అలాంటి చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలింగ్ పెరిగేట్టు చూడాలని చెప్పడం ప్రారంభించారు. ఇకపోతే, తమకు అనుకూలంగా ఉండే పలు గ్రామాల్లో ఓటింగ్ శాతం అంతగా లేకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఆయా గ్రామాల్లోని అనుచరులకు ఫోన్లు చేసి ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.


2014 లో పోలింగ్ ప్రక్రియతో పోల్చితే ఈసారి మధ్యాహ్నం సమయానికి నమోదైన పోలింగ్ శాతం చాలా తక్కువ. 2014లో రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు నమోదైన పాలేరులో ఈసారి ఒంటిగంటవరకు అతి తక్కువగా 34.49 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పోలింగ్ 50 శాతం దాటింది. అయితే, ఈసారి 42 శాతం కూడా దాటకపోవడం అభ్యర్థుల్లో ఆందోళన పెంచింది. ఇకపోతే, రాజధాని హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అతి తక్కువగా నమోదమవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనేక నియోజకవర్గాల్లో 30 నుంచి 35 శాతం పోలింగ్ దాటకపోవడం గమనార్హం.

ఉదయం నుంచి ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదుకాకపోవడం గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ తగ్గితే మెజారిటీలు తగ్గడం, స్వల్ప తేడాతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనేక పోలింగ్ కేంద్రాల్లో జనం తక్కువగా కనిపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. భోజన సమయం అయినందున తగ్గి ఉంటుందని, సాయంత్రానికి పుంజుకుంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అలాగే, ఈసారి వీవీపాట్ ప్రవేశపెట్టిన కారణంగా ఓటింగ్ ప్రక్రియ కొంతమేరకు ఆలస్యం జరుగుతోందని, అయితే చివరకు పోలింగ్ 70 శాతం మేరకు చేరుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement