స్కూల్‌ బస్సుపై దాడి.. రాహుల్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 12:42 PM

There will never be a cause big enough to justify violence against children, says rahul gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్‌’  సినిమా విషయంలో విధ్వంసాలకు దిగుతున్న కర్ణిసేన వ్యవహార శైలి తీవ్ర వివాదం రేపుతోంది. చిన్న పిల్లలు ఉన్నారన్న కనీస విచక్షణ చూపకుండా స్కూల్‌ బస్సుపై కర్ణిసేన కార్యకర్తలు దాడులు చేయడం విమర్శలకు తావిస్తోంది. స్కూల్‌ బస్సుపై కర్ణిసేన దాడులపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ‘పిల్లలపై హింసకు కారణం ఎంతపెద్దదైనా అది ఎన్నటికీ సమర్థినీయం కాదు. హింస, విద్వేషాలు బలహీనుల ఆయుధాలు. బీజేపీ హింసను, విద్వేషాన్ని ఉపయోగించుకుంటూ దేశాన్ని తగులబెడుతోంది’ అని రాహుల్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
 
పద్మావత్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కర్ణిసేన కార్యకర్తలు బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లో జీడీ గోయెంకా పాఠశాల బస్సుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ టైం ముగించుకొని పిల్లలతో ఇంటికి బయల్దేరిన బస్సును నిరసనకారులు మధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని బస్సును ముందుకు పంపించే ప్రయత్నం చేసేలోపే నిరసనకారులు రెచ్చిపోయి.. దాడి చేశారు. బస్సులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా రాళ్లవర్షం కురిపించారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సీట్లు, బస్సు ఫ్లోర్ అంతా కూడా అద్దాలతో నిండిపోయింది. ఒక్కసారిగా రాళ్లు దూసుకురావడంతో పిల్లలు బిక్కచచ్చిపోయారు. ప్రాణభయంతో వణికిపోయారు. బస్సులో ఉన్న ఉపాధ్యాయులు పిల్లలకు దెబ్బలు తగలకుండా చూసుకున్నారు. సీట్ల కింద దాక్కోవాలని, ఫ్లోర్‌పై పడుకోవాలంటూ గట్టిగా హెచ్చరించారు. చిన్న చిన్న పిల్లలను దగ్గరికి తీసుకొని వారు బెదిరిపోకుండా చూసుకున్నారు. ఈ ఘటనలో కర్ణిసేన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని, కర్ణిసేన రాళ్లు రువ్వుతూ.. పోలీసులతో కొట్లాడుతున్న సమయంలో ఈ ఘర్షణల్లో చిక్కుకోకుండా చాకచక్యంగా అక్కడి నుంచి బస్సును వేరేరూట్‌లోకి తరలించానని డ్రైవర్‌ తెలిపారు.

Advertisement
Advertisement