ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నాం | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నాం

Published Sun, Nov 12 2017 1:38 AM

Think of the alternative - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం వెల్లడించారు. జేఏసీ నేతలు రఘు, గోపాలశర్మ, పురుషోత్తంతో కలసి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా జేఏసీ అవతరించాలనే ఒత్తిడి వస్తున్నదని చెప్పారు. రాజకీయాలు అంత నీచమైనవేమీ కావని, వాళ్లలాగా(ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి) దొంగ దారిన వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

రాజకీయాలు అంటే స్వార్థం కోసం అన్నట్టుగా ఉందని, సమాజహితంకోరే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలన్నారు. స్వార్థరాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం జేఏసీ పనిచేస్తుందని పేర్కొన్నారు. నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఉద్యోగాలు రావడం లేదనే ఆవేదనతోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

ఉద్యోగాల ఖాళీల భర్తీకి కేలండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి చెల్లించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. కొలువుల కొట్లాట, అమరుల స్ఫూర్తియాత్ర వంటివాటికి హైదరాబాద్‌లో సభ పెట్టుకోవడం కష్టంతో కూడుకున్నదని, గురుకుల టీచర్ల కు మీటింగులు పెట్టుకోవడానికి కూడా అనుమతిని ఇవ్వలేదన్నారు. కోర్టు ద్వారా సభలకు అనుమతి రావడం తమ ఒక్కరి విజయంకాదని, సభలకు అనుమతిరాని వారంతా సాధించిన విజయమన్నారు.

ఇలాంటివాటికి ధర్నాచౌక్‌ను పునరుద్ధరిస్తే చాలునన్నారు. నవంబర్‌ 30న హైదరాబాద్‌లో కొలువుల కొట్లాట సభను జరుపుతామన్నారు. డిసెంబరు 9, 10 తేదీల్లో అమరుల స్ఫూర్తి యాత్ర నల్లగొండ జిల్లాలో ఉంటుందన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరితో సభలు జరపకుండా ఆగలేమన్నారు. వ్యవసాయాన్ని బాగుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కోదండరాం విమర్శించారు. కొలువుల కొట్లాట అనేది కేవలం జేఏసీ కార్యక్రమం మాత్రమే కాదని, సమ్మక్క జాతరకు వచ్చినట్టుగా అంతా కలిసి నిరుద్యోగులకు దారి చూపించాలని పిలుపునిచ్చారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement