సిద్దూ వ్యూహం పనిచేయలేదా? | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 11:01 PM

Top Congress Faces Not Participated In Election Campaigns - Sakshi

ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పాలించిన సర్కారుకు కన్నడ ప్రజలు మరో చాన్స్‌ ఇవ్వలేదు. పాలకపక్షాన్ని రెండోసారి ఎన్నుకోని కర్ణాటక సం‍ప్రదాయం ఈసారీ కొనసాగించారు. హిందువుల్లోని బలహీనవర్గాలు, మైనారిటీల సముదాయం ‘అహిందా’ కాంగ్రెస్‌కు మళ్లీ మెజారిటీ సీట్లు అందిస్తుందన్న పార్టీ విశ్వాసం వమ్మయింది.

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో కాషాయపక్షం ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రచార హోరు ముందు కాంగ్రెస్‌ కుదేలైంది. సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ, భాగ్య పథకాల అమలు కారణంగా పాలకపక్షంపై జనంలో అసంతృప్తి లేదన్న సీఎం విశ్వాసం సడలిపోయింది. రాష్ట్రంలో దాదాపు 14 శాతం వరకూ ఉన్న వీరశైవ లింగాయతులను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం మేలు చేయకపోగా బెడిసికొట్టింది.

సిద్దూను ఆదుకోని ‘అహిందా’
సిద్దూ ప్రభుత్వం హిందూ సమాజంలోని వెనుకబడినవర్గాలు(బీసీలు), దళితులు, ఆదివాసీలు(ఎస్సీ, ఎస్టీలు), అల్పసంఖ్యాకవర్గాల(మైనారిటీలు) (వీరందరినీ కలిపి కన్నడంలో ’అహిందా’ అని పిలుస్తారు) అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడమేగా వారిని కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాల నివ్వలేదు. మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులు, జైనులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కోస్తా ప్రాంతం కరావళిలో వారు కాంగ్రెస్‌ పక్షాన నిలవడంతో హిందువుల ఓట్లు కాషాయపక్షానికి పెద్ద సంఖ్యలో పడ్డాయి.

సోనియాగాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు కాంగ్రెస్‌ను ముస్లిం అనుకూల పార్టీగా దేశ ప్రజలు భావించినట్టే అహిందా నినాదం కూడా మెజారిటీ మతస్తులను హస్తం పార్టీకి దూరం చేసింది. అహిందా సముదాయంలోని అత్యధిక ప్రజానీకం అంతా పాలకపక్షానికి అండగా నిలబడలేదు. దళితుల్లోని మాదిగలు చాలా  ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లేశారని ఫలితాలు చెబుతున్నాయి.

బెడిసికొట్టిన లింగాయత్‌కార్డు
అతి పెద్ద హిందూ సామాజికవర్గం వీరశైవ లింగాయతులు 1990ల నుంచి బీజేపీకి దగ్గరవుతూ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. జనాభాతోపాటు పలుకుబడి గలిగిన లింగాయతులను చీల్చి కాంగ్రెస్‌కు అనుకూలంగా కొంతమంది నైనా మార్చడానికి సిద్దరామయ్య సర్కారు వీరశైవ లింగాయతులకు ప్రత్యేక మతవర్గంగా(మైనారిటీ) గుర్తింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సుచేసింది.

అయితే, ఈ ప్రయత్నం సానుకూల ఫలితం ఇవ్వకపోగా ఈ సామాజికవర్గాన్ని కాంగ్రెస్‌కు మరింత దూరం చేసింది. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించిన తమను చీల్చి బలహీనపర్చడానికి సిద్ధూ సర్కారు చేసిన కుట్రగా వారు భావించారు. ఫలితంగా లింగాయతులు అధిక సంఖ్యలో ఉన్న బొంబాయికర్ణాటక, హైదరాబాద్‌కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ అధిక సంఖ్యలో సీట్లు గెలిచింది.

మరో పక్క లింగాయతులను ఆకట్టుకోవడానికి వారికి మత అల్పసంఖ్యాక వర్గం హోదా ఇచ్చి అనేక రకాల ప్రయోజనాలు కల్పించడానికి ముఖ్యమంత్రి పని చేస్తున్నారనే కోపంతో రెండో ప్రధాన కులమైన ఒక్కళిగలు ఎప్పుడూ లేనంత ఐక్యతతో తమ కులానికి చెందిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌కు సంపూర్ణంగా మద్దతు పలికారు. సిద్దూ మైనారిటీ హోదా కార్డు కాంగ్రెస్‌కు మేలు చేయకపోగా ఎనలేని కీడు చేసింది. లింగాయతుల జనాభా ఉన్న ఉత్తర కర్ణాటకలోని మొత్తం 81 సీట్లలో బీజేపీ 47 గెల్చుకోగా, కాంగ్రెస్‌కు 26 సీట్లే దక్కాయి.

చాప కింద నీరులా ప్రజా వ్యతిరేకత
ఎన్నికల ముందు జరిపిన అనేక సర్వేలు కాంగ్రెస్‌ సర్కారుపై జనంలో అంత వ్యతిరేకత లేదని వెల్లడించాయి. జనంలో సిద్దూ ప్రభుత్వంపై పేరుకుపోయిన అసంతృప్తి పైకి కనిపించలేదు. 1970ల్లో అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి డి.దేవరాజ్‌ అరసు తర్వాత సిద్దరామయ్య ఒక్కరే వరుసగా ఐదేళ్లూ సీఎంగా కొనసాగారు. కాని, స్వయంగా ముఖ్యమంత్రే తన పాత మైసూరు ప్రాంతంలోని చాముండేశ్వరిలో ఓడిపోవడం, ఆయన కేబినెట్‌లోని 14 మంది మంత్రులు పరాజయం పాలవడం చాపకింద నీరులా వ్యాపించిన ప్రజా వ్యతిరేకతను ప్రతిబింబించాయి. 

కాంగ్రెస్‌లో ముఠాలు.. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు
కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు, సిద్దరామయ్య ఒంటెద్దు పోకడలు, అహంభావం కూడా పాలకపక్షం పరాజయానికి దారితీసింది. కాంగ్రెస్‌ అసెంబ్లీ టికెట్ల పంపిణీ బాధ్యతను మొత్తం స్క్రీనింగ్‌ కమిటీకి అప్పగించడంతో చివరి క్షణం వరకూ గందరగోళం తప్పలేదు. పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ ఎం.వీరప్పమొయిలీ, సీనియర్‌మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత ఎం.మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్‌ నేతలు టికెట్ల పంపిణీలో తమ వర్గీయులకు తగినన్ని టికెట్లు రాలేదనే అసంతృప్తితో ఎన్నికల ప్రచారంలో గట్టిగా పనిచేయలేదు.

బీసీ నేతలైన మొయిలీ, జనార్దన్‌ పుజారీ శాయశక్తులా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయలేదు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి అహంభావ పూరిత వైఖరి, ఒంటెద్దు పోకడలేననే విమర్శలొచ్చాయి. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సిద్దరామయ్యకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చి ఆయన ఎత్తుగడలకు, వ్యూహాలకు ఆమోదముద్ర వేయడం కూడా సీఎం ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమైందని సీనియర్‌నేతలు అంటున్నారు. 

గురి తప్పిన రాహుల్‌ ప్రచారం
ప్రధాని మోదీ కంటే కొన్ని నెలల ముందే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్‌ పోలింగ్‌ తేదీ దగ్గర పడే నాటికి ఆయనలో వేగం, దూకుడు తగ్గిపోయింది. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలు కూడా తక్కువే నిర్వహించారు. మే నెల ఆరంభం వరకూ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్న పరిస్థితి ఒకటి రెండు తేదీల నుంచి ఉధృతంగా సాగిన మోదీ, షా ప్రచారంతో ఒక్క సారిగా మారిపోయింది.

రాజకీయాలకు సంబంధం లేని కర్ణాటకకు చెందిన జనరల్‌ కరియప్ప, స్వాతంత్య్రానికి పూర్వం విప్లవ వీరుడు షహాద్‌ భగత్‌సింగ్‌ను కాంగ్రెస్‌ నేతలు ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ గౌరవించలేదన్న మోదీ ఆరోపణలు ఎన్నికల రాజకీయాన్ని వేడెక్కించాయి. ఈ ప్రచార సమయంలోనే అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్థాన్‌ తొలి అధ్యక్షుడు మహ్మద్‌ అలీ జిన్నా చిత్రపటం తొలగించాలనే డిమాండ్‌తో బీజేపీ విద్యార్థి సంస్థ ఏబీవీపీ సాగించిన ఆందోళన కన్నడ ఎన్నికల్లో ఓటర్లను కాషాయపక్షం వైపు మొగ్గేలా చేశాయి.

మెజారిటీ హిందూ మతస్తులను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గుడులు, మఠాలు సందర్శించినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు.  రాహుల్‌ను ఎలక‌్షన్‌ హిందూగా, మెకత మెతక హిందూగా బీజేపీ ముద్రవేసి ఆయన వ్యూహాన్ని నీరు గార్చింది.

పదునెక్కిన బీజేపీ-ఆరెస్సెస్‌ ప్రచారం
కాంగ్రెస్‌ అహిందా వ్యూహానికి దీటుగా బీజేపీ ఓటర్లను హిందువులుగా భావించి కమలానికి ఓటేసేలా బీజేపీ, ఆరెస్సెస్‌ పకడ్బందీ ప్రణాళికతో పనిచేశాయి. సాంస్కృతిక జాతీయవాదం పేరుతో అంకిత భావంతో పనిచేసే వేలాది మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్రంలోని 55 వేలకు పైగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను రప్పించే బాధ్యతను భుజాన వేసుకోవడం కూడా బీజేపీ బలం పెరగడానికి, కాంగ్రెస్‌బలం బాగా తగ్గడానికి కారకులయ్యారు. 

వారం ముందు ర్యాలీలు.. దూకుడు పెంచిన ప్రధాని మోదీ
రాష్ట్రంలో మోదీ ఎన్నికల ర్యాలీలు 15 ఉంటాయని మొదట నిర్ణయించారు. దూకుడుగా సాగిన ప్రధాని ప్రచారంతో కాంగ్రెస్‌ గుక్కతిప్పు కోలేకపోవడంతో ర్యాలీల సంఖ్యను 21కి పెంచడంతో బీజేపీ అభద్రతా భావానికి గురైందని అనుకున్నారు. అయితే, మోదీ రెండు రాత్రులు బెంగుళూలో బసచేసి అదనంగా ఆరు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం బీజేపీకి పోలింగ్‌కు రెండు రోజులు ముందు మంచి ఊపునిచ్చింది.

ప్రధాని ర్యాలీలు చివరి క్షణం వరకూ ఎటూ తేల్చుకోని ఓటర్లను బీజేపీ వైపు మళ్లిస్తున్నాయనే విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్తించారు. అప్పటి వరకూ కాంగ్రెస్‌కే మొగ్గు ఉందని అంచనావేసిన మీడియా కూడా మోదీ సభలు, ప్రసంగాలతో బీజేపీ పుంజుకుంటోందని ఫలితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని, బీజేపీకి కూడా విజయావకాశాలున్నాయని చెప్పడం ప్రారంభించింది. ర్యాలీలు జరిపి ప్రాంతాల ప్రముఖులు, సాంఘిక, ధార్మిక నేతల మాటలను ప్రధాని ఉటంకిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. లింగాయత ధర్మ స్థాపకుడైన బసవన్న వచనాలను వల్లె వేస్తూ కన్నడ ప్రజలకు దగ్గరయ్యారు. 
-(సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

Advertisement
Advertisement