టచ్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు | Sakshi
Sakshi News home page

టచ్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు

Published Mon, Feb 5 2018 3:29 AM

TRS leaders in touch - laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌  ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరేందుకు సమయం కోసం ఎదురు చూస్తు న్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. వారంతా తమతో టచ్‌లో ఉన్నారని, వీలు చూసుకుని బీజేపీలో చేరతా రని వెల్లడించారు. కొన్ని ఇతర పార్టీల కీలక నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ విషయాలు తెలిపారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది పెరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేవలం మాటలకే పరిమితమవుతున్నారని, ఈ నాలుగేళ్లలో విపరీతమైన అవినీతి పెరిగిపోవడాన్ని జనం గుర్తించారని, మరో పక్క కేంద్రంలో అవినీతి మచ్చ లేకుండా సాగుతున్న మోదీ పాలనతో బేరీజు వేసుకుని బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.

ఇటీవల తాను జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ మార్పును స్పష్టంగా గమనించానని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తన సొంత సర్వేలో కూడా గుర్తించిందన్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ కంటే బీజేపీకే అనుకూలత..
వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు వాస్తవం కాబోవని, నిజానికి చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కంటే బీజేపీనే బలంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు అధిక ప్రాధాన్యమిస్తామని అమిత్‌షా చెప్పారని.. ఇందులో భాగంగా నెలాఖరుకల్లా ఆయన రాష్ట్రంలో పర్యటించి వ్యూహం ఖరారు చేస్తారన్నారు. జూన్‌ నుంచి పోరాటాలతో ప్రజలకు చేరువవుతామన్నారు.  

నియోజకవర్గాల పెంపు ఉండదు..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడుతుందని లక్ష్మణ్‌ వెల్లడించారు. నియోజకవర్గాల పెంపు కూడా ప్రస్తుతానికి ఉండబోదని, ముందస్తు ఎన్నికలు కూడా రావని అధినాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చిందని చెప్పారు.

Advertisement
Advertisement