రూటు మార్చిన గులాబీ! | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన గులాబీ!

Published Tue, Mar 27 2018 2:16 AM

Trs mps concern in loksabha  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో లోక్‌సభలో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్‌ తన వ్యూహాన్ని మార్చుకుంది. లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకోవడం కాకుండా.. అవిశ్వాసంపై జరిగే చర్చలో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని లేవనెత్తి కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సోమవారం ప్రగతిభవన్‌లో సమావేశమైంది.

రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై, వారం రోజులుగా లోక్‌సభలో జరుగుతున్న పరిణామాలు, వాటిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఈ సమావేశం వివరాలను తెలంగాణభవన్‌లో ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కె.కవిత, బి.వినోద్‌కుమార్, మల్లారెడ్డి, పి.శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు..
రిజర్వేషన్లను సాధించుకునే విషయంలో వెనకడుగు వేసేది లేదని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. దీనిపై పార్లమెంటులో ఎన్ని నిరసనలు చేసినా ఉపయోగం లేకుండా పోతోందన్నారు. రిజర్వేషన్లు ఎవరికి ఎంతశాతం ఇవ్వాలన్న అంశంపై పూర్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపామని, అవిశ్వాసం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోందనే ఆరోపణ సరికాదని వ్యాఖ్యానించారు.

లోక్‌సభలో అవిశ్వాసం పెట్టడానికి ముందు నుంచే తాము ఆందోళన చేస్తున్నామని, దానికి అడ్డుతగులుతున్నామనే ప్రచారం అవాస్తవమని ఎంపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేయాలని, ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుపడాలన్నదే టీఆర్‌ఎస్‌ అభిమతమని ఎంపీ కవిత చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఎంపీ వినోద్‌కుమార్‌ విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ చర్చకు అనుమతిస్తే టీఆర్‌ఎస్‌ పాల్గొని, అవిశ్వాసానికి మద్దతిస్తుందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు, మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం నిబంధన అమలు ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

బీజేపీకి సహకరిస్తున్నామనే బద్నాం ఎందుకు?
కేంద్రంపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు అవిశ్వాసం పెడుతున్న సందర్భంలో అనవసరంగా బద్నాం కావడమెందుకని భేటీలో కేసీఆర్‌ అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ అంటూ దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలతో చర్చిస్తున్న సమయంలో.. ఏపీకి కీలకమైన హోదా గురించి పట్టించుకోనట్టు ఉండటం సరికాదని కొందరు ఎంపీలు పేర్కొన్నట్టు తెలిసింది. తమ ఆందోళనల కారణంగా ఎన్డీయే ప్రభుత్వంపై పెడుతున్న అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నామనే ప్రచారం జరుగుతోందని కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం.

పరోక్షంగా బీజేపీకి, ప్రధాని మోదీకి సహకరిస్తున్నామనే ప్రచారం జరుగుతోందని మరికొందరు ప్రస్తావించారు. దీంతో ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రతిపాదిస్తున్న సమయంలో.. బీజేపీకి సహకరిస్తున్నామనే బద్నాం టీఆర్‌ఎస్‌కు మంచిదికాదని కేసీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. సభా వ్యవహారాలకు అడ్డుతగలకుండా వ్యవహరించాలని సూచించినట్టు సమాచారం.  

Advertisement
Advertisement