టీఆర్‌ఎస్‌లో హోరెత్తుతున్న అసమ్మతి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో హోరెత్తుతున్న అసమ్మతి

Published Mon, Sep 10 2018 3:23 PM

TRS Rebels Protest Against MLA Tickets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి జ్వాలలు హోరెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున అసెంబ్లీ టికెట్‌ దక్కని నేతలు తమ అసంతృప్తిని బహిరంగగానే వ్యక్తపరుస్తున్నారు. ఓ వైపు గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌లో చేరినవారికి ఈ సారి టికెట్‌ కేటాయించడంపై ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనప్పటికీ మళ్లీ వారినే బరిలో నిలపడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు.  

ముక్తల్‌లో అసమ్మతి సభ
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ అసెంబ్లీ స్థానం తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కేటాయించడంపై పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నర్వ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ అసమ్మతి సభను నిర్వహించారు. ఈ సభకు మండలంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రామ్మోహన్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చే విషయాన్ని కేసీఆర్‌ పునః పరిశీలించాలని కోరుతున్నారు.

ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ ద్రోహం చేసింది; మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ
సంగారెడ్డి నియోజకర్గంలో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాజుకొంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం కేటాయింపుపై టీఆర్‌ఎస్‌ అధినేత పునరాలోచించాలని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ ద్రోహం చేసిందని విమర్శించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని పని చేశామని.. కానీ తమకు గుర్తింపు లేకుంగా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009, 2014 ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని తెలిపారు. సంగారెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

Advertisement
Advertisement