ఝలక్‌! | Sakshi
Sakshi News home page

ఝలక్‌!

Published Tue, Oct 31 2017 7:15 AM

trs zptc members join with revanth reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఆపరేషన్‌ఆకర్‌ష’తో విపక్షా లను కకావికలం చేసిన అధికారపార్టీకి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీకి గుడ్‌బై చెప్పి.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గులాబీ శిబిరానికి ఝలక్‌ ఇచ్చారు. ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులకు గాలం వేయడం ద్వారా టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు. సోమ వారం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ‘ఆత్మీయ సదస్సు’కు కొందరు అధికారపార్టీ ముఖ్యనేతలు హాజరుకావడం సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు కేవలం తెలుగుదేశం శ్రేణులే ఆయనను అనుసరిస్తాయని భావించిన గులాబీ పార్టీకి తాజా పరిణామం మింగుడుపడడంలేదు.

ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, చేవెళ్ల జెడ్పీటీసీ సభ్యులు ముంగి జ్యోతి, చింపుల శైలజ కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు అధికారికంగా ఒకట్రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింపుల సత్యనారాయణరెడ్డి(శైలజ భర్త), రాజేంద్రనగర్‌ నియోజకవర్గ నాయకులు జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, ముంగి జైపాల్‌రెడ్డి(జ్యోతి భర్త), రాజేంద్రనగర్‌ మండల ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, రైతుసమన్వయ సమితి సభ్యు డు మధుసూదన్‌రెడ్డి(షాబాద్‌) తదితరులు రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన నిర్వహించిన సమావేశానికి హాజరైన వీరంతా పార్టీలో చేరడానికి ఢిల్లీ బాట పట్టారు.  

రేవంత్‌ రూపంలో కొత్త జోష్‌...  
2014 ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టడమే తరువాయి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు వెల్లువెత్తాయి. రంగారెడ్డి జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో ప్రత్యేక దృష్టి సారించిన అధినాయకత్వం కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌లలో సమర్థులైన నేతలకు వల విసిరింది.

ఈ క్రమంలోనే ప్రతిపక్షాల శిబిరాలను దాదాపుగా ఖాళీ చేయించింది. అధికారపార్టీ ఆకర్షణను నిలువరించలేక దాదాపుగా చేతులెత్తేసిన కాంగ్రెస్‌కు రేవంత్‌ రూపంలో కొత్త జోష్‌ వచ్చింది. అంతేగాకుండా ఆయన అరంగ్రేటం చేసిందే తడువుగా జిల్లాలో అధికారపార్టీకి గండి కొట్టడంలో సఫలమయ్యారు. మరికొందరు జెడ్పీటీసీలు కూడా రేవంత్‌కు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుండడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

‘చింపుల’కు కలిసొచ్చింది...  
రేవంత్‌తో కొనసాగాలని నిర్ణయించుకున్న చింపులకు చేవెళ్ల మండలంలో మంచి పట్టుంది. దీనికితోడు మంత్రి మహేందర్‌రెడ్డికి సన్నిహితుడిగా కూడా పేరుంది. అయితే, కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. స్థానిక సంస్థలకు సీనరేజీ, టీడీలు ఇవ్వకుండా బదలాయించడంతో ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా జెడ్పీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ రెండు పరిణామాలు ఆయనను మంత్రికి దూరం చేశాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.  

సొంతగూటికి ఆ ‘ముగ్గురు’...  
గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా కొనసాగి.. జిల్లా పరిషత్‌ ఎన్నికల వేళ కారెక్కిన జ్ఞానేశ్వర్, జైపాల్‌రెడ్డి మాతృపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ జెడ్పీటీసీగా గెలుపొంది అనూహ్యంగా పార్టీ ఫిరాయించిన జ్యోతి కూడా రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తిరిగి సొంతింటి ప్రవేశం చేయాలనే నిర్ణయానికి వచ్చా రు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు వైరివర్గంగా వ్యవహరిస్తున్న ఈ నాయకులు.. కొన్నాళ్లుగా పార్టీ మారాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలకడంతో గులాబీకి గుడ్‌బై చెప్పారు. మరోవైపు మరో ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు కూడా త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. వీరిలో ఇద్దరు టీడీపీ వారు కాగా.. మరొ కరు అధికారపార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.

పార్టీకి టాటా.. ఢిల్లీ బాట..  
రేవంత్‌రెడ్డి నిష్క్రమణ తెలుగుతమ్ముళ్లను నైరాశ్యంలోకి నెట్టింది. ఒకప్పుడు ఆ పార్టీకి పెట్టనికోటగా ఉన్న జిల్లాలో ప్రస్తుతం నామమాత్రంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీపీ సారథిగా వ్యవహరిస్తున్న రేవంత్‌ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పడం.. శ్రేణులను డైలామాలో పడేసింది. ఈ క్రమంలోనే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, హయత్‌నగర్‌ మండల అధ్యక్షుడు కందాల రంగారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా.. మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు తోటకూర జంగయ్యయాదవ్, మాజీ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి, తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజుగౌడ్, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య తదితరులు కూడా రేవంత్‌ జాబితాలో ఉన్నారు. మంగళవారం ఢిల్లీ పర్యటన అనంతరం పార్టీలో ఉండేది ఎవరు? కాంగ్రెస్‌ కండువా కప్పుకునేది ఎవరు? అనే అంశంపై స్పష్టత రానుంది. కాగా, ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన నాయకులు ఆయనతో ఢిల్లీకి కూడా పయనమయ్యారు.

Advertisement
Advertisement