ప్రతిష్టాత్మకంగా రాహుల్‌ సభ | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా రాహుల్‌ సభ

Published Sun, Nov 5 2017 2:12 AM

Uttam kumar reddy about Rahul Sabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ముఖ్య నేతల సమావేశం జరిగింది.

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జె.గీతారెడ్డి, వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లు రవి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఇతర ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ నెల 20న రాహుల్‌గాంధీ పర్యటన దాదాపుగా ఖరారైందని.. దానిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి పార్టీ నేతలంతా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఉత్తమ్, కుంతియా సూచించారు. నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలపై ఏర్పడిన దుష్ప్రభావం, ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను ప్రజలకు తెలియజెప్పేందుకు.. ఈ నెల 8న పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు.

పెద్ద నోట్లు రద్దు చేసిన 8వ తేదీని బ్లాక్‌డేగా పాటించి.. రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని సూచించారు. ఈ ఆందోళనలో అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలని ఉత్తమ్‌ సూచించారు. ఆ ఏర్పాట్ల కోసం ఈ నెల 6న పాత జిల్లాల పరిధిలోని డీసీసీలు సమావేశం కావాలని ఆదేశించారు.

దేశాన్ని ఆగం చేసిన బీజేపీ
అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ దేశాన్ని ఆగం చేసిందని కుంతియా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు సమస్యలు, క్యూలైన్లలో పడిగాపులతో దేశవ్యాప్తంగా 200 మంది మరణించారని.. వారికి సంతాపంగా నివాళులు అర్పించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సూచించారు. నోట్లరద్దుతో నల్లధనం పెద్దఎత్తున బయటకు వస్తుందని, 50 రోజుల సమయం ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పిన ప్రసంగాలను.. ఇప్పటి దుస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

నోట్లరద్దుతో వేలాది కంపెనీలు మూతపడ్డాయని, నిరుద్యోగం మరింత పెరిగిందని, చిన్న వ్యాపారాలు కుదేలైనాయని... వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ నెల 19 నుంచి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో.. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలన్నారు. సమావేశం వివరాలను టీపీసీసీ ముఖ్యనేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి మీడియాకు వెల్లడించారు.

Advertisement
Advertisement