దగా చేస్తున్న కేసీఆర్‌! | Sakshi
Sakshi News home page

దగా చేస్తున్న కేసీఆర్‌!

Published Sun, Dec 10 2017 2:50 AM

uttam kumar reddy commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, సాగునీరు వస్తుందని ఆశపడితే కేసీఆర్‌ నిలువునా దగా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రాజెక్టులను పూర్తిచేయడం చేతగాక కాంగ్రెస్‌ పార్టీపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా ఒక్క హామీనీ అమలు చేయలేదని.. తాము మోసపోయామని విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, దళితులు, ఎస్టీలు, మైనారిటీలతో అన్ని వర్గాలు గుర్తించాయని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ కృతజ్ఞతా దినోత్సవంగా టీకాంగ్రెస్‌ నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కలసి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు.

వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే..
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఇవ్వాల్సిన కానుక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇవ్వడమేనని కార్యక్రమంలో ఉత్తమ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైతే జీవితాలు బాగుపడతాని భావించిన ఉద్యమకారులు, విద్యార్థులను సీఎం కేసీఆర్‌ మోసం చేశాడని మండిపడ్డారు. ఉద్యోగం రాదనే ఆవేదనతో ఉస్మానియా విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకుంటే.. సీఎం కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదని ఉత్తమ్‌ మండిపడ్డారు.

రుణమాఫీ అమలుకాక, పంటలకు గిట్టుబాటు ధరలేక రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని... రైతులకు రెండు లక్షల వరకు రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రానివారికి రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా అందిస్తామని హామీ ఇచ్చారు. వరికి 2 వేలు, పత్తికి 5 వేలు, మిర్చికి రూ. 10 వేల మద్దతు ధర కల్పిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం వచ్చిందని, అందరం కలసికట్టుగా పోరాడి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ మాటలతో జానా మోసపోయారు
సీఎం కేసీఆర్‌ చెప్పిన దొంగ మాటలకు సీనియర్‌ నేత కె.జానారెడ్డి మోసపోయారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయాలు, అధికారాన్ని పట్టించుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేసిన నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ అధ్యక్షత వహించగా.. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్‌బాబు, బోడ జనార్దన్, నేతలు దాసోజు శ్రవణ్, గూడూరు నారాయణరెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్, సీతక్క, ఆరేపల్లి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ రావాలి: భట్టి
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి బహుమతిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ బలైనా.. మొక్కవోని ధైర్యంతో అదే త్యాగశీలతను కనబర్చిన సోనియా జన్మదినం అందరికీ పండుగ దినమని చెప్పారు.

ఇక కేసీఆర్‌ను తరిమికొట్టే ఉద్యమం: రేవంత్‌
తెలంగాణ కోసం ఇంకా తుదిదశ ఉద్యమం జరగాల్సి ఉందని.. కేసీఆర్‌ను తెలంగాణ నుంచి తరిమికొట్టేందుకు ఆ ఉద్యమం రావాలని ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ మొదలైందని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉన్న త్యాగాల పార్టీ కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని.. దానిని సహించేది లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో అందరికంటే ఎక్కువ కేసీఆర్‌కే తెలుసునని.. కేటీఆర్‌కు చేతనైతే కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినా«థ్‌రావు గిరిజనులను మోసం చేశారని ఆరోపించారు. పాకాల హరినాథ్‌రావు ఎస్టీ సర్టిఫికెట్‌పై అటవీశాఖలో ఉద్యోగం పొందారని, జిల్లా అటవీశాఖాధికారిగా రిటైరయ్యారని చెప్పారు. మరి కేటీఆర్‌ మామ వెలమా.. ఎస్టీయా?.. ఎస్టీలో ఏ తెగ కిందకు వస్తారో, ఎలా వస్తారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని... తాను చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

హరినాథ్‌రావు తప్పుడు సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొంది, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు తీసుకోవడమేగాక.. ఇప్పుడు పెన్షన్‌ కూడా తీసుకుంటున్నారన్నారు. ఎస్టీలను మోసం చేసిన హరినా«థ్‌రావుపై కేసు పెట్టి, జైలుకు పంపాలని.. తాను చేసిన ఆరోపణ తప్పయితే తనపై కేసు పెట్టాలని రేవంత్‌ సవాల్‌ చేశారు. గుంటూరు, పుణే, అమెరికాలో చదువుకున్న మంత్రి కేటీఆర్‌కు తెలంగాణలో చప్రాసీ ఉద్యోగానికి కూడా అర్హతలేదని విమర్శించారు.  

కేసీఆర్‌ కృతఘ్నుడు: జైపాల్‌రెడ్డి
ప్రధాని పదవిని మూడు సార్లు తిరస్కరించిన సోనియాగాంధీ త్యాగానికి మారుపేరని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు నెగ్గిననాడే కేసీఆర్‌ తన మనవళ్లతో కలసి సోనియాగాంధీ దగ్గరకు వెళ్లి ప్రణమిల్లారన్నారు. ఇప్పుడు అబద్ధాలతో మోసం చేస్తున్న కృతఘ్నుడు కేసీఆర్‌ అని విమర్శించారు. కేసీఆర్‌ను అ«ధికారంలో లేకుండా చేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగమే కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి చేరిక అని.. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.

సోనియాకు తెలుగు నేతల శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 71వ జన్మదినం సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు సోనియాను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీలు టి.సుబ్బిరామిరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి పి.శంకర్రావు ఉన్నారు.  

Advertisement
Advertisement