ప్రతీకారం తీర్చుకుంటాం | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకుంటాం

Published Fri, Sep 28 2018 2:07 AM

Uttam kumar reddy commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు నలుగురే విలాస జీవితం గడుపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా టీఆర్‌ఎస్‌ మోసం చేసిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి రాష్ట్రం లో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ నేతలపైనా రాజ కీయ కక్ష తీర్చుకుని తీరుతామని హెచ్చరించారు.

గురువారం గాంధీభవన్‌లో నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ నునావత్‌ బాలునాయక్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామీ గౌడ్‌లు వేలాది మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం కూడా పార్టీలో చేరా రు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు వారికి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్య సంస్థలను విధ్వంసం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు.

అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేశారని, ఇప్పడు రేవంత్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసి మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉన్నారని జానారెడ్డి పేర్కొన్నారు.

తరిమికొడదాం: కోమటిరెడ్డి
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చకుండా మోసపూరిత వాగ్దానాలతో పాలన సాగించిన టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో తరమికొడదామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైందని, దళితులను, గిరిజనులను అణచివేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ముదనష్టపు పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బిక్షమయ్యగౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అద్యక్షుడు క్యామ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement