కేసీఆర్‌ది దొంగ దీక్ష | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది దొంగ దీక్ష

Published Sat, Oct 6 2018 2:12 AM

Uttam kumar reddy commentes over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అప్పట్లో నిమ్స్‌ ఆసుపత్రిలో దొంగ ఆమరణ దీక్ష చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన దొంగ దీక్ష చేశాడని నిరూపించే సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, అన్ని రకాల మందులు, ఫ్లూయిడ్స్‌ తీసుకుని దీక్ష చేశాడని పేర్కొన్నారు. దీక్ష సమయంలో కేసీఆర్‌ ఆహారం, ఫ్లూయిడ్స్‌ అన్నీ తీసుకున్నాడని.. కేవలం గడ్డం మాత్రమే పెంచాడని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

దీక్ష పేరుతో ఖమ్మం ఆసుపత్రిలో చేరి అక్కడ కాం పౌండర్‌ దగ్గరి నుంచి బలవంతంగా జ్యూస్‌ గ్లాసు లాక్కుని తాగి దీక్ష విరమించానని కేసీఆర్‌ చెప్పారని, అప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఉద్యమించడంతో మళ్లీ దీక్ష అని నిమ్స్‌ ఆసుపత్రిలో పడుకున్నారని ఎద్దేవా చేశారు. నిమ్స్‌ ఆసుపత్రి ఇచ్చిన డిశ్చార్జి రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని, అందులో కేసీఆర్‌కు అన్ని రకాల ఫ్లూయిడ్స్‌ ఇచ్చామని వైద్యులు చెప్పారంటూ ఆ కాపీలను మీడియాకు విడుదల చేశారు.

కేసీఆర్‌ను బరాబర్‌ బట్టేబాజ్‌ అంటామని, ఆయన అబద్ధాల కోరు, మోసగాడని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. ‘‘నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు.  నేను దేశ రక్షణ కోసం యుద్ధవిమానాలు నడిపే పైలట్‌గా ఉన్నప్పుడు కేసీఆర్‌ దొంగపాస్‌పోర్టుల ఏజెంట్‌. దుబాయ్‌ దొంగపాస్‌పోర్టుల ఏజెంటుగా ఢిల్లీ పోలీసులకు కేసీఆర్‌ దొరికినప్పుడు వాళ్లు ఆయన్ను తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అప్పుడు ఎంపీగా ఉన్న ఎం.సత్యనారాయణరావు కేసీఆర్‌ను విడిపించారు’’అని ఉత్తమ్‌ తెలిపారు.  తాను ఆదర్శంగా బతుకుతున్నానని, తనకు పిల్లల్లేరని, తెలంగాణ ప్రజలే తనకు పిల్లలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు జాతీయ భావమే లేదు
దొంగ దీక్షను విరమించిన సందర్భంగా డిసెంబర్‌ 20, 2009న 4లక్షల మంది చనిపోయినా తెలంగాణ పోరు ఆగదని కేసీఆర్‌ చెప్పారని ఉత్తమ్‌ గుర్తు చేశారు. అంతకుముందు నవంబర్‌ 30న సిద్దిపేటలో హరీశ్‌రావు ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు కానీ ఏమీ చేసుకోలేదని, విద్యార్థులు మాత్రం ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ 2001, ఏప్రిల్‌లో ఆవిర్భవించిందని, అప్పటినుంచి ఒక్క స్వాతంత్య్ర వేడుకల్లో కూడా పార్టీ కార్యాలయంలో కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదని, అసలు ఆయనకు జాతీయ భా వం లేదని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ జయంతులకు కూడా కనీసం దండ వేసే తీరిక కూడా కేసీఆర్‌కు ఉండదని మండిపడ్డారు. తాము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే కేసీఆర్‌కు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాకుం డా అడ్డుపడిన ఎంఐఎంతో ఆయన పొత్తు ఎలా పెట్టుకుంటాడని ప్రశ్నించారు.  

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే
హైదరాబాద్‌ నగరానికి టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని, నగరంలో మౌలిక వసతుల కల్పన అంతా కాంగ్రెస్‌ హాయాంలోనే జరిగిందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, మెట్రోరైలు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది తామేనని పేర్కొన్నారు.   ‘కేసీఆర్‌ హఠావో, తెలంగాణ బచావో’నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్‌లు గజదొంగలని.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆరు శాతం కమీషన్లు తీసుకుంటున్నారన్నారు.  

ఎక్కువ సమయం పనిచేయండి: కుంతియా
తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా మాట్లాడుతూ పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ఎక్కువ సమయం పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఎంఐఎం, బీజేపీలు దొందూ దొందేనన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

గ్రేటర్‌లో కనీసం 10 సీట్లు గెలవాలి
హైదరాబాద్‌ పరిధిలోని 15 సీట్లలో కనీసం 10 సీట్లకు తగ్గకుండా పార్టీ గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. టికెట్ల కోసమంటూ తన ఇంటి చుట్టూ, గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దని, టికెట్లు పారదర్శకంగా సమర్థులకే ఇస్తామని స్పష్టంచేశారు. నియోజకవర్గాల్లో తిరగాలని, పాదయాత్రలు చేయాలని, కాంగ్రెస్‌ను గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసినవారికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement