స్వరాజ్యమైదానాన్ని కొట్టేయడానికి చంద్రబాబు కుట్ర | Sakshi
Sakshi News home page

స్వరాజ్యమైదానాన్ని కొట్టేయడానికి చంద్రబాబు కుట్ర

Published Thu, Sep 27 2018 4:21 AM

Velampalli Srinivas and Malladi Vishnu comments on Chandrababu - Sakshi

విజయవాడ సిటీ: పులిచింతల కాంట్రాక్టర్‌ బొలినేని శ్రీనయ్య కంపెనీకి స్వరాజ్య మైదానాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్‌ నియోజకర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి అదనపు పనులు చేపట్టామని, అందుకు సంబంధించి డబ్బు చెల్లించలేదని కాంట్రాక్టర్‌ కోర్టుకు వెళ్లితే... సకాలంలో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించకపోవడం చంద్రబాబు కుట్రలో భాగమేనన్నారు. ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, దినేష్‌కుమార్‌ మచిలీపట్నం ఇచ్చిన కోర్టుపై హైకోర్టుకు అప్పీలకు వెళ్లదామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ బొల్లినేని శీనయ్య కోసం ఇదంతా జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంతో పాటు పులిచింతల ప్రాజెక్టుకు చెందిన 48 ఎకరాల భూమి, ఇరిగేషన్‌ క్వార్టర్స్‌ను దక్కించుకోవాలని చంద్రబాబు కుట్రపన్నారన్నారు. స్వరాజ్యమైదానం, 48 ఎకరాలు, ఇరిగేషన్‌ క్వార్టర్స్‌ విలువలను తెలియజేయాలని కోర్టు ఆదేశించే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే ఉద్దేశంతో అందుకు కావాల్సిన నిధుల సేకరించేందుకు కాంట్రాక్టర్‌తో కుమ్మకై ఈ కుట్రపన్నారని విమర్శించారు. స్వరాజ్య మైదాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తుందని నేతలిద్దరూ స్పష్టం చేశారు.

కృష్ణా డెల్టాకు వరప్రదాయని అయిన పులిచింతల ప్రాజెక్టును 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతింటున్న చంద్రబాబు... విజయమాల్యా, నీరవ్‌ మోదీలా పారిపోయేందుకే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఇంద్ర భవనంలాంటి ఇల్లు, సింగపూర్‌లో హోటల్‌ కట్టుకున్నారని గుర్తు చేశారు. ఆయన భార్య నారా భువనేశ్వరి దేశంలోని ధనవంతుళ్లలో ఒకరిగా, రాష్ట్రంలో టాప్‌ టెన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత ఆస్తి ఈ నాలుగేళ్లల్లో ఎలా సంపాదించారో తెలియజేస్తే ప్రజలు కూడా ఆ విధంగా వ్యాపారం చేస్తారని హితవుపలికారు.

Advertisement
Advertisement