మార్పునకు ఓటెయ్యండి | Sakshi
Sakshi News home page

మార్పునకు ఓటెయ్యండి

Published Mon, Apr 8 2019 2:49 AM

Vote for the change says YS Jagan In Election Campaign - Sakshi

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండేవి. వాటిని మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో కలిపి ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి. రుణాలన్నీ మాఫీ చేశాను, నన్ను గుర్తు పెట్టుకోండి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా?.
– అనకాపల్లి సభలో...

నాలుగేళ్లు టీడీపీతో కలిసి కాపురం చేసిన ఆ సినిమా నటుడు ఎన్నికల ముందు ఆ పార్టీతో విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్‌ ఇచ్చాడు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన జగన్‌పై నాలుగేళ్లలో 22 కేసులు పెట్టిన చంద్రబాబు ఆ నటుడిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. వారి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
– గాజువాక సభలో...

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  ప్రజాకంటక పరిపాలనకు చరమగీతం పాడాలని, ఈ ఎన్నికల్లో మార్పునకు ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే.. అన్నీ చేసేశానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని, మోసం చేస్తున్న ఇలాంటి అన్యాయస్థుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబులా మాయ చేయకుండా తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలను కేవలం రెండు పేజీల్లోనే తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో ఇచ్చిన ప్రతి హామీని ప్రజల కళ్లముందే అమలు చేసి చూపిస్తామని తేల్చిచెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా లబ్ధి చేకూరుస్తామన్నారు. హామీలన్నీ అమలు చేసి ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓట్లు అడుగుతామని అన్నారు. తమ ఎన్నికల ప్రణాళికలో అబద్ధాలు, మోసాలు లేవని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ, విశాఖ జిల్లా అనకాపల్లి, గాజువాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...  

ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు  
టెక్కలి సభలో..
మంత్రి అచ్చెన్నాయుడే రింగ్‌ మాస్టర్‌..
ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక దందాకు రింగ్‌ మాస్టర్‌ ఎవరూ అంటే... టెక్కలి నుంచే ఎన్నికైన మంత్రి అచ్చెన్నాయుడి పేరే వినిపిస్తోంది. టీడీపీ నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజల సంపదను ఎలా దోచుకోవాలని స్కెచ్‌లు మాత్రం వేస్తుంటారు. ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టు అయినా అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులకే. నీరు–చెట్టు పథకం ముసుగులో చెరువుల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వేసి అమ్ముకొని, రూ.వందల కోట్లు సంపాదించారు. ఇక్కడ ఎకరా రూ.5 కోట్ల విలువ చేసే ఏపీఎస్‌ఆర్‌టీసీ స్థలాన్ని కేవలం రూ.3 లక్షలకే లీజు పేరుతో కాజేస్తున్నారు. 

భావనపాడు పోర్టు పేరుతో భూపందేరం ..: టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు పేరుతో భూపందేరం మొదలెట్టారు. ఏకంగా 4,900 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.  భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో సుమారు 20 వేల మంది మత్స్యకారులున్నారు. వారు తెచ్చిన చేపలను నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరేజీ సదుపాయం లేదు.  మన ప్రభుత్వం వచ్చాక భావనపాడు పోర్టులో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేస్తాం.  

తిత్లీ బాధితులను ఆదుకుంటాం..: తిత్లీ తుపాను ధాటికి టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం నియోజకవర్గాలు అతలాకుతలమయ్యాయి. రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన తిత్లీ తుపాను బాధితులకు ఇచ్చింది రూ.510 కోట్లు మాత్రమే. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాను బాధితులను ఆదుకుంటాం. కూలిపోయిన ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.3 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తాం. ధ్వంసమైన జీడిమామిడి తోటలకు హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున ఇస్తాం. గతంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్సార్‌ రూ.140 కోట్లతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.62 కోట్లతో దాదాపు 40 శాతం పనులు పూర్తి చేయించారు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని పట్టించుకునేవారే లేరు. ప్రజలకు నష్టం కలిగిస్తున్న కాకరాపల్లి పవర్‌ ప్రాజెక్టును రద్దు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవో 1108ను ఇప్పటికీ రద్దు చేయలేదు. 

ఐదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఏం చెప్పాలి? ఇదిగో నా ఎన్నికల ప్రణాళిక, ఇందులో నేను చేప్పినవి చేశాను అని చూపించి ఓటు అడగాలి. కానీ, చంద్రబాబు ఏం చెబుతున్నాడో తెలుసా? 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాడట! చెప్పనివీ చేశాడట! ప్రజలను దారుణంగా మోసం చేస్తున్న ఇలాంటి అన్యాయస్థుడు మనకు కావాలా? 

గాజువాకలో యాక్టర్‌కు, లోకల్‌ హీరోకు మధ్య పోటీ
గాజువాక సభలో..
గాజువాక నియోజకవర్గంలో ఓ సినిమా నటుడికి, లోకల్‌ హీరోకు మధ్య పోటీ జరుగుతోంది. ఆ నటుడు నామినేషన్‌ వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించాయి. నాలుగేళ్లు ఆ పార్టీతో కలిసి కాపురం చేసి, ఎన్నికల ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్‌ ఇచ్చాడు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన జగన్‌పై నాలుగేళ్లలో 22 కేసులు పెట్టిన చంద్రబాబు ఆ నటుడిపై మాత్రం ఒక్క కేసూ పెట్టలేదు. వారి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన స్థానికుడు తిప్పల నాగిరెడ్డి అసలైన హీరో. ఆయనకు ఓటు వేసి గెలిపించాలి.  

కుంభకోణాల అడ్డాగా విశాఖ..: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విశాఖను కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారు. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్‌ ఆస్తులు.. ఏవీ వదిలిపెట్టలేదు. రూ.లక్షల కోట్ల అవినీతికి, భూ కుంభకోణాలకు తెగబడ్డారు. బినామీలకు కారుచౌకగా భూ కేటాయింపులు జరిపారు. బీచ్‌రోడ్డులో రూ.వేల కోట్ల విలువైన స్థలాలను వాళ్ల అత్తగారి సొత్తు అన్నట్లుగా లూలూ గ్రూపునకు స్టార్‌ హోటల్‌ కట్టడానికి ధారాదత్తం చేసేశారు. ఏడాదికి ఒకసారి భాగస్వామ్య సదస్సు పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబుకు భాగస్వామ్య సదస్సుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ఉన్న ప్రత్యేక హోదాను సాధించడంపై లేదు. బాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టకపోయి ఉంటే ఈపాటికి లక్షల ఉద్యోగాలు మనవాళ్లకు వచ్చి ఉండేవి కాదా? విశాఖ సాక్షిగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేశాడు. విశాఖ ఎయిర్‌పోర్టులో సాక్షాత్తూ వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి చేయించారు.

బాబు హయాంలో ఐటీ రివర్స్‌ గేర్‌..: వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖలో ఐటీ రంగం ఉరుకులు పరుగులు పెట్టగా.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఐటీ రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిపోయింది. వైఎస్సార్‌ హయాంలో విశాఖ ఐటీలో 16 వేల ఉద్యోగాలుంటే.. చంద్రబాబు హాయంలో 12 వేల ఉద్యోగాలే ఉన్నాయి. ప్రైవేట్‌ వర్సిటీలకు మేలు చేసేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. విద్యార్థులంతా తన బినామీ విద్యా సంస్థ అయిన గీతంలో చదువుకునేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. కేజీహెచ్‌ పరిస్థితి దారుణంగా ఉంది. గాజువాకలో పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీ లేకపోవడం దారుణం. ఇదేనా చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి?  

విశాఖ ప్రగతికి వైఎస్సార్‌ బాటలు..: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల 3 నెలలు పాలించారు. విశాఖపట్నం ప్రగతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండా కేంద్రంతో పోరాడారు. స్టీల్‌ప్లాంట్‌ విస్తరణకు నిధులు సేకరించారు. హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీని విస్తరించారు. షిప్‌యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి దాన్ని మూతపడకుండా కాపాడారు.  ఈ ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం చేశాడో మీరే బేరీజు వేసుకోవాలి. స్టీల్‌ ప్లాంట్‌ను మళ్లీ అంపశయ్యపైకి తీసుకెళ్లారు.

మన మేనిఫెస్టోలో మోసం లేదు, అబద్ధం లేదు
కోరుకొండ సభలో..
పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నా. వాళ్ల జీవితాలను మార్చాలని, వారి మొహంలో చిరునవ్వులు చూడాలన్నదే నా ఆశయం.  రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కుటుంబానికీ మేలు చేస్తాం. ప్రతి కుటుంబానికి అక్షరాలా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా లబ్ధి చేకూరుతుంది. ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో తెలిపాం. మన మేనిఫెస్టో రెండు పేజీలు మాత్రమే ఉంది. ఇందులో ఎలాంటి మోసం లేదు, అబద్ధాలు లేవు. ప్రతి పేదవాడికి మనం ఏం చేస్తామో ఇందులో చెప్పాం. రెండు పేజీలే ఎందుకు పెట్టామంటే 2014 నాటి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో మాదిరిగా మాయ చేయడానికి కాదు. ఇందులో చెప్పిన ప్రతి హామీని మీ కళ్ల ఎదుటే పూర్తి చేసి చూపిస్తాం. మళ్లీ ఐదేళ్ల తరువాత ఈ మేనిఫెస్టోను మీ ముందుకు తీసుకొచ్చి, ఇందులో చెప్పిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టి 2024లో మాకు మళ్లీ ఓటు వేయండి అని అడుగుతాం.  

సిగ్గు లేకుండా బాబు అబద్ధాలు..: చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు ఆడడం నాకు చేతకాదు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నాడు. మన పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కొన్ని గంటల తరువాత చంద్రబాబు 34 పేజీలతో టీడీపీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేశాడు. అందులో 24 పేజీల్లో కొత్త వాగ్దానాలు చేశాడు. దాదాపు 300 కొత్త వాగ్దానాలు ఉన్నాయి. చంద్రబాబు 2014లో కూడా 54 పేజీల టీడీపీ మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేశాడు. అందులో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేసిన పాపాన పోలేదు.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతికితే 2014 మేనిఫెస్టో కనిపించకుండా మాయం చేశాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఏం చెప్పాలి? ఇదిగో నా ఎన్నికల ప్రణాళిక, ఇందులో నేను చెప్పినవి చేశాను అని చూపించి ఓటు అడగాలి. కానీ, చంద్రబాబు ఏం చెబుతున్నాడో తెలుసా? 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ గత ఐదేళ్లలో ప్రణాళికాబద్ధంగా అమలు చేశాడట! చెప్పని అంశాలను కూడా అమలు చేశాడట! సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. ప్రజలను దారుణంగా మోసం చేస్తున్న ఇలాంటి అన్యాయస్థుడు మనకు కావాలా?   

‘పోలవరం’లో కమీషన్ల దందా..: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తూర్పు గోదావరి జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది. 2018 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ, ఆ ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు. పోలవరం ప్రాజెక్టుతో కమీషన్లు దండుకోవాలని ఆరాట పడుతున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. పోలవరం పనులను నామినేషన్‌పై సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో కాటవరం, ముగ్గళ్ల, మునికొడవలి, వంగలపూడి ర్యాంపుల వద్ద వందలాది లారీలు పెట్టి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను మన కళ్ల ఎదుటే దోచేశారు. 

‘పసుపు–కుంకుమ’ పేరుతో పచ్చి మోసం  
అనకాపల్లి సభలో..
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేస్తున్నాడు. వాళ్లకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టి ఇప్పుడు పసుపు–కుంకుమ ఇచ్చినట్టుగా మాయ చేస్తున్నాడు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చాడు. ఆయన సీఎం అయ్యే నాటికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలుండేవి. వాటిని మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో కలిపి ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి. రుణాలన్నీ మాఫీ చేశాను, నన్ను గుర్తు పెట్టుకోండి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తానని హామీ ఇచ్చి చివరకు మొండిచేయి చూపించాడు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అగ్రిగోల్డ్‌ బాధితులకు రూపాయి కూడా ఇవ్వలేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, బినామీలు గద్దల్లా కాజేస్తున్నారు. మనందరి ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం.  
 
రైతుల వేలుతో వారి కంట్లోనే పొడుస్తున్నారు..: పాడి రైతుల బతుకులను విశాఖ డెయిరీ పాలకవర్గం పీల్చిపిప్పి చేస్తోంది. రైతుల నుంచి దోచేసిన సొమ్మును సొసైటీల ద్వారా వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయాలని కుట్రలు సాగిస్తున్నారు. రైతుల వేలుతో వారి కంట్లోనే పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. పాడి రైతుల బాధలు, విశాఖ డెయిరీ ఉద్యోగుల సమస్యలు నాకు గుర్తున్నాయి. విశాఖ డెయిరీ యజమాని కొడుకు చేస్తున్న అరాచకాలు తెలుసు. రైతుల రక్తాన్ని అటువైపు నుంచి హెరిటేజ్‌ డెయిరీ, ఇటు వైపు నుంచి విశాఖ డెయిరీ పీల్చేస్తున్నాయి. కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం సహకార రంగంలో ఉన్న డెయిరీలను పూర్తిగా నాశనం చేశారు. తన హెరిటేజ్‌ సంస్థ లాభాల కోసం చంద్రబాబు ఇతర డెయిరీలను మూసివేయించాడు.  

రైతన్నలకు నేనున్నా..: నా పాదయాత్రలో చెరుకు రైతుల కష్టాలు చూశాను. తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని నాలుగేళ్లు ఊరించారు. చివరకు ఎన్నికల ముందు తెరిచారు. కనీసం రెండు నెలలు కూడా ఆ ఫ్యాక్టరీ నడపలేదు. ఈ సంవత్సరానికి సంబంధించిన రూ.5 కోట్ల బకాయిలు చెల్లించలేదు. తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని బెల్లం రైతులు కన్నీరు పెట్టుకున్నారు. సంక్రాంతి వస్తే చంద్రన్న కానుక ఇస్తున్నారు. కానీ, బెల్లం మాత్రం మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నారు. అనకాపల్లి రైతుల నుంచి బెల్లం కొనుగోలు చేయడం లేదు. రైతన్నల కష్టాలు నాకు తెలుసు. మీకు నేనున్నాను అని హామీ  ఇస్తున్నా.  

మన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాం. రెండే రెండు పేజీలు. ఎందుకో తెలుసా? ఇందులో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతిరోజూ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకునేది ఉండదు. పాలకులు చేసేది ఉండదు. ఇందులో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటాను. ప్రతిరోజూ ఏం చేశానో చెబుతా. చంద్రబాబులా మోసాలు చేయను, అబద్ధాలు ఆడను. ఈసారైనా మార్పునకు ఓటు వేయాలా వద్దా అని ఒక్కసారి ఆలోచించండి. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీలు 
- ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్‌ నేరుగా సీఎంకు రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం. 
ఫీజులు తగ్గించడమే కాదు.. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించే విధంగా నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా నేనే సమీక్షిస్తా.  
నెలకు రూ.40 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000  దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం 
పరిధిలోకి తీసుకొస్తాం.  
పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. 
ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం.  
మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. 
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం.  
పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం.  
అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం.   
ఇల్లు లేని పేదల కోసం ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం.  
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం.  
ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, నెలకు రూ.5 వేలు వేతనమిస్తాం. 
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం.  
పంటల పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
రైతులకు సున్నా వడ్డీకే రుణాలు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం.  
ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలిస్తాం.  
జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  
సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం.  
చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు అందజేస్తాం.  
అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం.  
ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం.  
సంఘమిత్ర, వీవోఏలు, వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం.  
మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తాం.  
ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తాం. వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ వచ్చేలా చేస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం.  
ప్రభుత్వమిచ్చే ఫ్లాట్లకు పేదలు తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణం మాఫీ చేస్తాం. 
తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు కేటాయించి 13 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం.   
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకం.

Advertisement

తప్పక చదవండి

Advertisement