‘వైఎస్‌ జగన్‌పై కుట్రలు పన్నుతున్నారు’ | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌పై కుట్రలు పన్నుతున్నారు’

Published Tue, Nov 21 2017 12:41 PM

we will fight for special status will continue, says MP YV subbareddy - Sakshi - Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టామని ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఒంగోలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. హోదా కోసం అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళతాం. ప్ర‌త్యేక హోదా కోసం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వివిధ సంద‌ర్భాల్లో పోరాటాలు చేశాం. హోదాపై మా పోరాటం కొనసాగుతుంది. మా రాజీనామాలతో హోదా వస్తుందంటే ...వెంటనే రాజీనామాలు చేస్తాం. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మార్చాలనుకుంటున్నారు.

చంద్రబాబుకు డైజెస్ట్‌ కావడం లేదు..
ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వైఎస్‌ జగన్‌పై కుట్రలు పన్నుతున్నారు. ప్రతిపక్ష నేత వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అడ్డుకుంటారా?. జగన్‌ పాదయాత్ర ప్రారంభించగానే టీడీపీలో వణుకు మొదలైంది. ప్రజలు జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతను కలిసే వారిని అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది.  పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి  జగన్‌ నుంచి ప్రజలను ఏ విధంగా దూరం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు. చంద్రబాబు అరాచకాలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు.

సత్యాలను వక్రీకరిస్తూ చట్టసభను తప్పుదోవ పట్టిస్తున్న నారా లోకేష్‌పై లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం. నరేగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనిపై విచారణ చేయాలని మాత్రమే లేఖలు రాశాం. నిధులు ఆపమని కాదు. పదిసార్లు అబద్ధాలు చెబితే అవి నిజాలు కావు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌ గమనించాలి.’  అని సూచించారు. మంత్రి లోకేష్‌ వారి నాన్న చంద్రబాబు మాదిరిగా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజం చేయాలనే సంస్కృతిని ఫాలో అవుతున్నట్లున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నరేగ ఫండ్స్‌ సరిగ్గా వినియోగించడం లేదని, పేదలకు మూడు పూటలా తిండితినేందుకు తెచ్చిన పథకం నీరుగారిపోతుందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, యంత్రాలతో పనిచేయిస్తున్నారని లేఖ రాశాం.’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Advertisement
Advertisement